ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ - జనసేనలు పొత్తుతో ముందుకు వెళుతున్నాయి. వైసీపీ ఒంటరి పోరుకు సిద్ధమైంది. ఈ తరుణంలో బీజేపీ స్టాండ్ ఏంటనేది తెలియరాలేదు. ఏపీ రాష్ట్ర నేతలేమో.. టీడీపీతో పొత్తు పెట్టుకుంటేనే మంచిదని అధిష్టానానికి చెబుతున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అధిష్టానం మాత్రం ఏ విషయాన్ని తేల్చలేదు. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వచ్చేసి నియోజక ఇన్‌చార్జుల నియామకంపై దృష్టి సారించారు. దీంతో బీజేపీ ఒంటరి పోరుకే సిద్ధమైందంటూ వార్తలు వచ్చాయి. ఆ తరువాత అంతా కూడా బీజేపీది ఒంటరి పోరే. పరోక్షంగా వైసీపీకి సహకరిస్తుందని భావించారు.
మూడు ముక్కలాట స్టార్ట్..
సడెన్‌గా టీడీపీ అధినేత చంద్రబాబు హస్తినకు వెళతారంటూ వార్తలు రావడం ఒక్కసారిగా ఏపీ రాజకీయాలను వేడెక్కేలా చేసింది. ఇక చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడితో భేటీ అవడం ఆసక్తికరంగా మారింది. ఇక పొత్తు గురించి వార్తలు వస్తాయని అనుకున్నారంతా. కానీ రాలేదు. మరింత ఆసక్తికరంగా చంద్రబాబు హైదరాబాద్‌కు వచ్చిన రోజు సాయంత్రమే జగన్ ఢిల్లీకి రావడం.. అమిత్ షాతో భేటీ అవడం చకచకా జరిగిపోయాయి. ఇంకేముంది? బీజేపీ మూడు ముక్కలాట స్టార్ట్ చేసింది. అటు జనసేనతో పొత్తులో ఉంది.. టీడీపీని దూరం పెడుతోంది. పరోక్షంగా వైసీపీకి సహకరించేందుకు సిద్ధమైపోయిందంటూ ప్రచారం జరిగింది.
ఎంత పెద్ద కూటమి ఉంటే అంత మంచిది..
ఇక తాజాగా ఏపీలో పొత్తులపై అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పొత్తుల విషయాన్ని త్వరలోనే తేల్చుతామంటూనే.. ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారంటూ హింట్ ఇచ్చేశారు. కుటుంబ పరంగా ప్యామిలీ ప్లానింగ్ బావుంటుంది కానీ రాజకీయంగా ఎంత పెద్ద కూటమి ఉంటే అంత మంచిదని భావిస్తున్నామన్నారు అంటే తాము ఒంటరి పోరుకు సిద్ధంగా లేమని చెప్పకనే చెప్పేశారు. తమ మిత్రులను ఎప్పుడూ తాము బయటకు పంపించింది లేదన్నారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని వారే బయటకు వెళ్లి ఉండవచ్చన్నారు. పంజాబ్‌లో అకాలీదళ్‌తో చర్చలు నడుస్తున్నాయని స్పష్టం చేశారు. మొత్తానికి అమిత్ షా అయితే పరోక్షంగా టీడీపీతో పొత్తు ఉంటుందని తేల్చేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.