ఏపీలో పాలన పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా మారింది. ఏం చేయాలనుకుంటే అది చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు అత్త సొమ్ముని అల్లుడి దానం చేస్తున్నట్టుగా ప్రభుత్వ ఖజానా నుంచి కోట్లు దానం చేసేందుకు జగన్ సిద్ధమయ్యారు. అసలే జగన్ అధికారంలోకి వచ్చాక ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అయినా సరే.. కేంద్ర సాయంతో అప్పుల మీద అప్పులు తెస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా ఒకటి కాదు.. రెండు కాదు.. అవార్డుల పేరిట వలంటీర్లకు రూ.392 కోట్లు పంచిపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే జీతాల పేరిట వందల కోట్లు, సాక్షి పేపర్ కొనుగోలు కోసమని మరికొన్ని కోట్లు.. అవార్డుల పేరిట మరికొంత డబ్బు దానం చేస్తూనే ఉన్నారు.
ఎవరి మాటనూ ఖాతరు చేయకుండా..
ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మరింత డబ్బు.. అవార్డుల పేరిట ఇచ్చి వారిని గ్రిప్‌లో పెట్టుకోవాలని చూస్తున్నారు. నిజానికి వలంటీర్లను తమ సొంత సైన్యంగానే భావిస్తున్నారు. ఈ క్రమంలోనే వారికి ప్రజాధనం నుంచి జీతాలు చెల్లిస్తున్నారు. పైగా ప్రతి నెల సాక్షి పేపర్ కొనుక్కోవడానికి రూ.200 చొప్పున ఇస్తున్నారు. ఎన్ని విమర్శలు రానీ గాక.. జగన్ మాత్రం ఏమీ పట్టించుకోరు. వలంటీర్ పేరిట సొంత సైన్యాన్ని సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు ఈ సైన్యాన్ని న్యాయస్థానాలు, కేంద్ర ఎన్నికల కమిషన్ మాటను కూడా ఖాతరు చేయకుండా ఎన్నికల్లో ప్రవేశ పెట్టాలని చూస్తున్నారు. వీరి ద్వారా వైసీపీ అభ్యర్థులకు సహాయ సహకారాలు అందేలా చర్యలు తీసుకోనున్నారు.
జీతాలు పెంచకుండా..
అయితే వలంటీర్లు జీతాల పెంపుదల గురించి ఆందోళన చేస్తున్నారు. దీంతో నేరుగా జీతాలు పెంచితే లేని పోని ఇబ్బందులొస్తాయని భావించిన జగన్ ప్రభుత్వం వారిని ఖుషీ చేసేందుకు అవార్డుల పేరిట రూ.392 కోట్లను దోచిపెట్టేందుకు సిద్ధమైంది. గతంలో కూడా వలంటీర్లకు నగదు పురస్కారాలు అందజేసేది. అయితే అప్పుడు రూ.10 వేలు, 20 వేలు,30 వేలు చొప్పున ఇచ్చేది. ఇప్పుడు వాటిని ఏకంగా.. రూ.15 వేలు, 30 వేలు, 45 వేలకు పెంచేసింది. జీతాలు పెంచకుండా ఇలా తెలివిగా వారిని వైసీపీ తన దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తోందన్నమాట.