టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి.. నారా భువనేశ్వరి, ఆమె కోడలు నారా బ్రాహ్మిణిని చూడాలని ఎవరికి ఉండదు. వారు ఏదైనా మాట్లాడితే వినాలని ఎవరికి ఉండదు? అయితే వారు బోర్ కొట్టించే విషయాలేమీ చెప్పడం లేదు. చీరల గురించి చెప్పినా జనాల్ని తమ ప్రసంగంతో కట్టిపడేస్తున్నారు. డైలాగ్స్ మీద డైలాగ్స్ కొడుతూ ఒక పక్క అగ్ర నేతలంతా రాజకీయాలను హీటెక్కిస్తుంటే భువనేశ్వరి మాత్రం వాతావరణాన్ని చాలా తేలిక చేశారు. పరిస్థితులను ఆహ్లాదకర నింపేశారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా భువనేశ్వరి అనంతపురం జిల్లా ధర్మవరంలో పర్యటించారు.
నవ్వుల పువ్వులు!
ధర్మవరంలో భువనేశ్వరి ఒక సభను కూడా నిర్వహించారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత, తన భర్త చంద్రబాబు గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఆమె వెల్లడించి సభలో నవ్వుల పువ్వులు పూయించారు. తన 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో చంద్రబాబు ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తుండేవారని ఆమె తెలిపారు. ప్రజల తరువాతే చంద్రబాబుకు భార్య, కుటుంబమని తలిపారు. అయితే ఒకసారి చంద్రబాబును భువనేశ్వరి.. ‘అందరి భర్తలు.. భార్యల కోసం ఏదో ఒకటి తీసుకొస్తారు.. మీరు నా కోసం ఒక్క చీరైనా తీసుకొచ్చారా?’ అని అడిగారట. అలా అడిగిన పాపానికి గుర్తు పెట్టుకుని మరీ తనకు చంద్రబాబు ఒక గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చారట.
మంగళగిరి అంటేనే ప్రేమతో..
తన కోసం చంద్రబాబు ఒక చీర తీసుకొచ్చారని భువనేశ్వరి వెల్లడించారు. అది చూశాక తనకు హార్ట్ అటాక్ వచ్చినంత పనైందట. ఆ చీర అంత దారుణంగా ఉందట. కానీ తనకోసం గుర్తు పెట్టుకుని మరీ ప్రేమగా తీసుకొచ్చారు కాబట్టి దాన్ని దాచుకున్నానని భువనేశ్వరి వెల్లడించడంతో సభలో అంతా హాయిగా నవ్వుకున్నారు. మరోవైపు మంగళగిరిలో నేడు నారా బ్రాహ్మణి పర్యటించారు. ఆమె మంగళగిరి చేనేత చీర కట్టుకుని మరీ అందరినీ ఆకట్టుకున్నారు. టాటా సీఈఓ అంబుజాతో కలిసి చేనేతల కోసం నిర్మించిన వీవర్ శాలను బ్రహ్మణి ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడుతూ.. మంగళగిరి అంటేనే నేతన్నలు ప్రేమతో నేసిన చీరలు గుర్తువస్తాయంటూ అక్కడి చేనేత కార్మికులను ఆకట్టుకున్నారు. మొత్తానికి అత్తాకోడళ్లు చీరలే అజెండాగా వాతావరణాన్ని తాము పర్యటించిన చోట వాతావరణాన్ని ఆహ్లాదపరిచారు.