మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.. ఏపీ సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసుపై జగన్, ఎంపీ అవినాశ్ రెడ్డి తదితరుల ప్రమేయముందని తేల్చి చెప్పారు. తన సోదరుడు జగన్‌కి, వైసీపీకి ఓటు వేయవద్దని కోరారు. హత్యలకు పాల్పడే వారికి పాలించే హక్కు లేదని సునీత తేల్చి చెప్పారు. ఈ కేసులో భాగంగా తన పోరాటంలో అండగా నిలిచిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్, ఎంపీ రఘురామ కృష్ణరాజుకు సునీత ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రి హత్యకు సంబంధించి తాను చేస్తున్న పోరాటంలో ఏపీ ప్రజల మద్దతు కోరారు. సాధారణంగా హత్య కేసు 4, 5 రోజుల్లో తేలుతుందని.. వివేకా హత్య కేసు దర్యాప్తు మాత్రం ఏళ్ల తరబడి కొనసాగుతోందని సునీత అన్నారు.
వారిద్దరినీ జగనే రక్షిస్తున్నారు..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంతవారే తన తండ్రిని మోసి చేసి ఓడించారని సునీత తెలిపారు. మార్చురీ వద్ద అవినాశ్ తనతో మాట్లాడారని.. ఒక్కోసారి హంతకులు మన మధ్యే ఉంటున్నా తెలియనట్లే ఉంటుందని పేర్కొన్నారు. సీబీఐ దర్యాప్తునకు వెళదామని అప్పట్లో జగన్‌ని అడిగానని... అలా వెళితే అవినాశ్ బీజేపీలోకి వెళ్తారని జగన్ అన్నారని సునీత తెలిపారు. అయినా సరేతాను సీబీఐకి ఫిర్యాదు చేశానన్నారు. ఆ తర్వాత నుంచి తనకు, తన భర్తకు వేధింపులు ఎదురయ్యాయన్నారు. సీబీఐ పైన కూడా కేసులు పెట్టడం మొదలు పెట్టారని పేర్కొన్నారు. కేసు విచారణ ముందుకు సాగకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టించారన్నారు. తన తండ్రి హత్య కేసులో భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని... వారిద్దరిని జగన్ రక్షిస్తున్నారన్నారు. తిరిగి తమ పైనే కేసులు పెడుతున్నారన్నారు. సీబీఐకి ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నాయో తనకు తెలియదని సునీతారెడ్డి తెలిపారు.
ప్రజలు గుర్తిస్తే జగన్‌కు ఓటేయరు..
షర్మిల ఒక్కరే తనకు మొదటి నుంచి అండగా నిలిచారన్నారు. 700 మందిపైగా కుటుంబ సభ్యులు ఉన్నారని.. ఎన్ని గొడవలు ఉన్నా అందరం కలిసే ఉన్నామని సునీత తెలిపారు. కానీ తనకు అండగా ఎవరూ ముందుకు రాలేదన్నారు. తన తండ్రి హత్య కేసులో జగన్ పాత్రపై విచారణ జరపాలన్నారు. గొడ్డలితో నరికి చంపారనే విషయం ఆయనకి ఎలా తెలుసని ప్రశ్నించారు. ప్రజలు తన న్యాయమైన పోరాటమని గుర్తిస్తే వారు జగన్‌కు ఓటు వేయరన్నారు. ఇలాంటి క్రైం కనిపించొద్దంటే ప్రజలంతా ముందుకు రావాలి. ప్రభుత్వం ప్రభావం కనిపిస్తుంది అందుకే కేసు ముందుకు వెళ్ళడం లేదు. సొంత వాళ్లను అంత సులువుగా అనుమనించలేమని.. అందుకే జగన్ ని కలిసినప్పుడు తనకు ఆయనపై అనుమానం రాలేదన్నారు. వివేకానంద హత్య కేసులో 8 మంది పేర్లు బయటకు వచ్చాయని.. ఇంకా బయటకు రావల్సిన పేర్లు చాలా ఉన్నాయన్నారు. అసలు ఎంపీ విజయసాయిరెడ్డిని సీబీఐ ఎందుకు ప్రశ్నించడం లేదని సునీతారెడ్డి నిలదీశారు.