వైసీపీలో వికెట్ల మీద వికెట్లు పడుతున్నాయి. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యులు, ఎమ్మెల్సీలన్న తేడా లేకుండా పార్టీని వీడుతున్నారు. టికెట్ ఇచ్చినా.. ఇవ్వకున్నా కూడా పార్టీని వదిలేస్తున్నారు. నేడు మంత్రి గుమ్మనూరు జయరాం పార్టీకి రాం రాం చెప్పబోతున్నారు. దీనికి కారణాలు ఏమైనా ఉండొచ్చు. వైసీపీ అధినేత జగన్ నిర్వాకాలతో పార్టీ నిట్టనిలువునా మునగడం ఖాయమని నేతలకు చాలా వరకూ అర్ధమై పోయింది. ఇక జగన్ మెప్పు పొందడం కోసం విపక్షాలను కన్నూ మిన్నూ కానకుండా తిట్టిపోసి ఇప్పుడు ఆ పార్టీల్లోకి వెళ్లేందుకు మొహం చెల్లక.. పైగా వేరే మొహం తగిలించుకుని వెళ్లినా కూడా ఆ పార్టీ తీసుకోవని భావించిన నేతలు మాత్రం చేసేదేమి లేక వైసీపీలోనే ఉండిపోతున్నారు.
జగన్‌కు వ్యతిరేకం కానిదెవరు?
ఇక మిగిలిన నేతలు మాత్రం వేరే పార్టీలోకి జంప్ చేస్తున్నారు. 365 రోజుల్లో క్రాప్ హాలిడే, పవర్ హాలిడే మాదిరిగా 24 రోజుల పాటు అప్పులకు కూడా హాలిడే చెప్పేసి మిగిలిన రోజులన్నీ యథేచ్ఛగా అప్పులు చేస్తోంది జగన్ సర్కార్. కాగ్.. స్వయంగా ఈ విషయం వెల్లడించడంతో జనం అవాక్కయ్యారు. ఏపీ ఎంత డేంజర్‌లో ఉందో తెలుసుకుని షాక్ అయ్యారు. పైగా అసలు జగన్‌కు వ్యతిరేకం కాని దెవరని? అన్ని పార్టీల దగ్గర నుంచి సొంత చెల్లి, బాబాయి కూతురు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఇలా చెప్పుకుంటే పోతే లిస్ట్ చాంతాడంత. వీళ్లందరినీ కాదని జగన్ గట్టెక్కగలరా? పోనీ వలంటీర్లను పెట్టుకుని పోరాడదామంటే వాళ్లలో కొందరు ఉద్యోగం పోయినా పర్వలేదంటున్నారు. ఇక ఏం చేయాలి?
కర్నూలు పార్లమెంట్ ఇన్‌చార్జ్‌గా..
ఇక నేడు వైసీపీకి మంత్రి గుమ్మనూరు జయరాం గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యారు. నేడు తన మంత్రి పదవితో పాటు పార్టీకి రాజీనామా చేసి సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు. ముఖ్యంగా ఏపీలో ఇన్‌చార్జుల మార్పు తర్వాత గుమ్మనూరుకు నిరాశే ఎదురైంది. ఆయన కోరుకున్న ఆలూరును ఇవ్వకుండా... కర్నూలు పార్లమెంట్ ఇన్‌చార్జ్‌గా జయరాంకు జగన్ అవకాశం కల్పించారు. అది గుమ్మనూరుకు నచ్చలేదు. దీంతో కొద్ది రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చివరికి పార్టీ మార్పుకు సిద్ధమయ్యారు. ఆలూరులో గుమ్మనూరు జయరాం అనుచరులు కూడా ఇప్పటికే రాజీనామాలు చేస్తున్నారు. ఇక ఈ రాజీనామాల బాటలో ఇంకెంతమంది వైసీపీ నేతలు ఉంటారో చూడాలి.