అవును.. మీరు వింటున్నది.. చదువుతున్నది నిజమేనండోయ్..! వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్సెస్ టాలీవుడ్ గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్‌గా పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం నాడు పిఠాపురం నియోజకవర్గానికి అటు జగన్.. ఇటు చరణ్ విచ్చేస్తున్నారు. దీంతో ఎన్నికల క్యాంపెయిన్ క్లైమాక్స్ రంజుగానే ఉండబోతోంది. అయితే జనం జగన్ వైపా..? లేకుంటే చెర్రీ వైపా..? అనేది తెలియట్లేదు. అర్థం కావట్లేదా.. అదేనండోయ్.. జనాలు జగన్‌ను చూడటానికి వెళ్తారా లేకుంటే.. మెగా హీరో వచ్చాడని ఇటు వెళ్తారా..? ఇటు వెళ్తే అటు.. అటు వెళ్తే ఇటు బోసిపోతుందేమో మరి..!
గబ్బర్ సింగ్ కోసం గట్టిగానే..!
పిఠాపురం నుంచి పోటీచేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఇప్పటికే మెగా హీరోలు, పలువురు సీనియర్, జూనియర్ హీరోలు, ఆర్టిస్టులు.. దాదాపు బుల్లి, వెండితెర నటీనటులు వాలిపోయారు. కొన్నిరోజులుగా పిఠాపురంలోనే తిష్టవేసి పవన్ గెలుపుకోసం తమవంతు పాత్ర పోషిస్తున్నారు. పవన్ కూడా నాలుగైదు సార్లు అక్కడికెళ్లి సమావేశాలు, బహిరంగ సభలు నిర్వహించడం జరిగింది. అయితే.. తనకు మద్దతిస్తున్నట్లే ట్విట్టర్ వేదికగా ప్రకటించిన చెర్రీ.. ఇప్పుడు నేరుగా పిఠాపురం వెళ్తున్నారు. ఆయనొక్కడే కాదు.. పవన్ వదిన, చిరంజీవి సతీమణి సురేఖ కూడా వెళ్తున్నారు. వీరితో పాటు నిర్మాత అల్లు అరవింద్ కూడా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి బయల్దేరి వెళ్లారు. రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడ్నుంచి రోడ్డు మార్గాన పిఠాపురం బయల్దేరి వెళ్లనున్నారు. అంటే క్లైమాక్స్ సీన్‌లోకి గ్లోబల్ స్టార్ ఎంటరయ్యాడన్న మాట.
ఎవరెటు..?
పిఠాపురం వెళ్లాక.. కుటుంబ సభ్యులతో కలిసి స్థానికంగా ఉన్న కుక్కుటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సభ లాంటిదేమీ లేదు కానీ.. మీడియాతో మాత్రం చెర్రీ, సురేఖ, అల్లు అరవింద్ మాట్లాడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరోవైపు.. జగన్ మాత్రం భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. వైసీపీ తరఫున పోటీచేస్తున్న సీనియర్ నేత వంగా గీతకు మద్దతుగా ప్రచారం నిర్వహించబోతున్నారు. అయితే జనం ఇప్పుడు ఇటు రామ్‌చరణ్‌ను చూడటానికి వెళ్తారా లేకుంటే జగన్ కోసం వస్తారా అనేది ఇరు పార్టీలకు అర్థం కాని పరిస్థితి. ఇదిలా ఉంటే.. పవన్ కూడా కాకినాడ సిటీలో ప్రచారం నిర్వహించబోతున్నారు. ఎన్నో అడ్డంకుల మధ్య సిటీలో.. అది కూడా ద్వారంపూడి ఇలాకాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. చూశారుగా.. క్లైమాక్స్ సీన్ ఇదీ సంగతి..!