ఫలితాలకు ముందే పురంధేశ్వరి ఔట్!
ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరిని తప్పించడానికి సర్వం సిద్ధం అయ్యిందని గల్లీ నుంచి ఢిల్లీ వరకూ పెద్ద చర్చే జరుగుతోంది. ఎన్నికల ముందే ఆమెను తప్పించాలని చూసినప్పటికీ.. ఇప్పుడు సమయం ఆసన్నం కావడంతో కమలనాథులు ఆ పనిలో ఉన్నారట. ఎందుకంటే.. వందల సంఖ్యలో ఫిర్యాదులు, పార్టీ బలోపేతానికి చేసిందేమీ లేదని ఢిల్లీ పెద్దలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు తెలిసింది. ఏపీలో ఏదో చేయాలని పెద్దలు అనుకోవడం, ఇందుకు పూర్తి భిన్నంగా పురంధేశ్వరి చేయడంతో అసలేం జరుగుతోంది అని జేపీ నడ్డా.. అమిత్ షా ఫిక్స్ అయ్యారట. ఇందుకు చాలా కారణాలే ఉన్నాయట.. ముఖ్యంగా మాధవి లతను ఉదాహరించి చెబుతున్నారట.
మాధవి మేలు.. మీరేం చేశారు..?
హైదరాబాద్ పార్లమెంట్ నుంచి మాధవి లత పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి.. టికెట్ వచ్చాక, ఎన్నికల ప్రచారంలో.. ఇన్నాళ్లు భాగ్యనగరం మనదే, మనల్ని ఎవడురా ఆపేది అని ఫీల్ అయిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి చుక్కలు చూపించారు అని బీజేపీ నేతలు చెబుతున్న పరిస్థితి. అంతే కాదు ఎన్నికల ప్రచారం ఎన్నడూ చేయని అసద్ పాతబస్తీ గల్లీ గల్లికి తిప్పిన ఘనత మాధవిదే..!. ఆఖరికి పోలింగ్ రోజున కూడా ఎలా ఎలక్షనీరింగ్ చేసిందో అందరూ టీవీల్లో చూసే ఉంటారు. దీంతో లోకల్ మీడియా మొదలుకుని జాతీయ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. ఒక ఎంపీ అభ్యర్థి
అయ్యిండి మాధవి ఎలా ఉన్నారు..? ఎంత చేశారు..? ఏం చేశారు..? ఇక అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరి ఇంకెలా ఉండాలి..? పార్టీ కోసం ఎంత చేయాలి..? కానీ చేసిందేమీ లేదన్నది బీజేపీ పెద్దల భావన.
పార్టీ కోసమా.. మరిది కోసమా..?
ఈ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు సంగతి అటుంచితే.. బీజేపీ ఎన్ని ఎంపీ, ఎమ్మెల్యే సీట్లలో గెలుస్తుందనేది ఎవరికీ అర్థం కావట్లేదు. పోనీ బీజేపీ పోటీ చేసిన చోట బలంగా ప్రచారం చేసిన పరిస్థితులు ఉన్నాయా..? అదీ లేదు. ఎంత సేపూ టీడీపీ కోసమే, మరిది కోసమే పని చేశారే తప్ప.. పార్టీ కోసం పని చేసిన దాఖలాలు లేనే లేవని ఏపీ బీజేపీ నేతల నుంచి పెద్ద ఎత్తునే అగ్రనేతలకు ఫిర్యాదులు వెళ్లాయట. దీంతో పురంధేశ్వరి వల్ల పార్టీకి పైసా ప్రయోజనం లేదని ఢిల్లీ పెద్దలు కన్నెర్ర చేస్తున్నారట. అందుకే ఫలితాలకు ముందే తప్పించి.. కట్టర్ బీజేపీ నేత అయిన సత్య కుమార్ లేదా సుజనా చౌదరి.. ఆదినారాయణ రెడ్డికి పదవి కట్టబెట్టే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇందులో నిజమెంత.. ఏం జరుగుతుందో చూడాలి మరి.