ఇన్నాళ్లు ఒక లెక్క.. ఈ ఒక్కరోజు ఓ లెక్క.. ఎందుకంటే ఎప్పుడెప్పుడూ అని వేచి చూస్తున్న రోజు రానే వచ్చేసింది..! రాత్రంతా ఒక్కటే అలజడి.. పడుకుంటే నిద్ర రాదు.. నిద్రపోతే ఎప్పుడెప్పుడు తెల్లారుతుందో అని ఒక్కటే కంగారు, మధ్య మధ్యలో కలలు.. తమ అభిమాన నేత, పార్టీ గెలుస్తుందా లేదా..? ఓడిపోతే పరిస్థితేంటి..? గెలిస్తే ఏం చేద్దాం..? ఇలా బుర్ర నిండా ఆలోచనలే.. ఇదీ ఓటేసిన ఓటరు మనోగతం! తెల్లారింది లెగండోయ్ అంటూ తట్టి మరీ నిద్రలేపింది..!. దీంతో దేవుడా ఎన్నాళ్లో వేచిన ఉదయం వచ్చేసింది అన్నట్లుగా పార్టీల అధిపతులు, పోటీదారులు, అభిమానులు.. ఆయా పార్టీ శ్రేణులు నిద్రలేచాయి..! ఇదంతా దేని గురించి అనేది ఈపాటికే అర్థమయ్యి ఉంటుంది కదా..! తెలుగు రాష్ట్రాలే కాదు.. యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగోడు ఎంతో ఆసక్తిగా.. అంతకుమించి నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం లోపు గెలుపెవరిదో తేలిపోనుంది.
ఏం జరుగుతుందో..?
అనుకున్నట్లుగానే ఎలాంటి గొడవలు, హడావుడి లేకుండా ప్రశాంతంగానే కౌంటింగ్ ప్రారంభమైంది. 8 గంటలకే రాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్ మొదలైంది. 102 సెగ్మెంట్లలో 1-2 రౌండ్లు, 48 నియోజకవర్గాల్లో 3 రౌండ్లు, 25 సెగ్మెంట్లలో 4 రౌండ్లలో కౌంటింగ్ షురూ అయ్యింది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో ప్రారంభమై.. 8:30 నుంచి ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. ఇక.. వైసీపీ ఐదేళ్ల పాలనకు పాతరేస్తారో.. లేకుంటే సంక్షేమ సారథి వైఎస్ జగన్ మోహన్ రెడ్డేనని నమ్మి వన్స్ మోర్ సీఎంగా కంటిన్యూ చేస్తారో.. లేదంటే సంక్షేమం, అభివృద్ధి సాగిస్తామనే కూటమి (టీడీపీ, జనసేన, టీడీపీ) కే పట్టం కట్టి చంద్రబాబుకు సీఎం పీఠం ఇస్తారో అన్నది మధ్యాహ్నంతో ట్రెండ్ క్లియర్‌గా తేలిపోనుంది. ఇక ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఏ మేరకు నిజమవుతాయి..? అట్టర్ ప్లాప్ అయ్యే సర్వేలేవీ.. అక్షరాలా నిజమయ్యే సర్వేలేవి అన్నది మరికొన్ని గంటల్లో క్లియర్ కట్ పిక్చర్ వచ్చేయనుంది.
రెడీ.. బీ రెఢీ!
ఏపీ చరిత్రలోనే రికార్డు స్థాయి ఓటింగ్ శాతంతో అటు అధికార పార్టీ.. ఇటు కూటమిలోనూ టెన్షన్‌గానే ఉంది. మరోవైపు.. మహిళా ఓటు అత్యధికంగా నమోదు కావడం, పోస్టల్ బ్యాలెట్‌తో ఉద్యోగులు పోటెత్తడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా.. 4,13,33,702 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 3,33,40,560 మంది ఓటర్లు ఈవీఎంల్లో తమ తీర్పును భద్రపరిచారు. వీరిలో అత్యధికంగా మహిళలు 1,69,08684 మంది ఉండగా.. పురుషులు 1,64,30,359 మంది, థర్డ్‌జెండర్లు 1517 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏ పార్టీ గెలుస్తుంది..? ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు..? అనేది మొదలుకుని ఫైనల్‌గా ఎవరు గెలిచారనే దాని వరకూ అప్డేట్స్ www.cinejosh.com లో చూసేయండి.. ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గో..!!