కంటెంట్ లేకుండా ఎంత రుద్దినా ప్రయోజనం ఉండదని అన్నారు మన దేశం గర్వించదగిన నటులలో ఒకరైన నవాజుద్దీన్ సిద్ధిఖీ. తాజాగా ఆయన ఓటీటీ, థియేటర్స్ సినిమాల గురించి, అలాంటి సినిమాలలో యాక్ట్ చేయడంలో ఉన్న డిఫరెన్స్‌ను గురించి మాట్లాడారు.
ఒక మంచి నటుడికి థియేటర్ సినిమా అయినా, ఓటీటీ సినిమా అయినా ఒకటే. కెమెరా ముందు నటించేవాడికి ఏదైనా ఒకటే. థియేటర్, ఓటీటీ ఏదైనా.. నటనలో మాత్రం మార్పు ఉండదు. అయితే ఈ రెండింటికి మాత్రం కొన్ని తేడాలున్నాయి. శుక్రవారం థియేటర్స్‌లో సినిమా విడుదలైతే.. రిజల్ట్ ఏంటనేది వెంటనే తెలిసిపోతుంది. కానీ ఓటీటీ అలా కాదు. అది వీక్షకుల ఆదరణను బట్టి కాస్త ఆలస్యంగా తెలుస్తుంది. రెండింటికి డిఫరెన్స్ ఇదేనని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. శుక్రవారం విడుదలైన సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఓకే కానీ.. లేదంటే మాత్రం కష్టమే. ఆయా హీరోల ఫ్యాన్స్, నిర్మాతలు శని, ఆదివారాల్లో సినిమాని ఎలాగోలా ఆడించినా సోమవారం మాత్రం వారి వల్ల కూడా కాదు. ఎందుకంటే టాక్ బయటికి వెళ్లిపోతుంది. కాబట్టి.. ఎలాంటి సినిమా అయినా సరే.. అది థియేటర్, ఓటీటీ ఏదైనా సరే కంటెంట్ ముఖ్యం. కంటెంట్ లేకుండా ప్రేక్షకులపై బలవంతంగా రుద్దాలని ఎంత ప్రయత్నించినా ఉపయోగం ఉండదని అన్నారు నవాజుద్దీన్ సిద్ధిఖీ.