ఏమండోయ్ నాని గారు.. ఏంటిది!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏ క్షణాన వైసీపీ ఘోర పరాజయం పాలైందో నాటి నుంచి నేటి వరకూ ఆ పార్టీకి ఎదురు దెబ్బలు తప్పట్లేదు. ఒకటా రెండా ఒక దెబ్బ నుంచి కోలుకోక మునుపే మరొకటి.. ఇలా వరుస షాకులతో పార్టీ సతమతం అవుతోంది. ఇప్పుడిప్పుడే నేతలు, కార్యకర్తలను తాడేపల్లి ప్యాలెస్‌కు పిలిపించుకుని మాట్లాడుతున్న అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఊహించని రీతిలోనే షాకులు తగులుతున్నాయ్. నిన్న గాక మొన్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు రాజీనామా చేయగా.. ఆ షాక్ నుంచి తేరుకోక మునుపే వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు, వైఎస్ జగన్‌కు నమ్మకస్తుడు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్.. అలియాస్ ఆళ్ల నాని రాజీనామా చేసేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కీలక నేతగా ఉన్న ఈయన రాజీనామా చేయడంతో వైసీపీ ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైంది.
రాజీనామా వెనుక..?
వైఎస్ బతికుండగా కాంగ్రెస్‌తో మొదలైన నాని రాజకీయ ప్రయాణం వైఎస్ జగన్ దగ్గర ఆగిపోయింది. శుక్రవారం నాడు తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా.. వ్యక్తిగత కారణాలతో అని స్పష్టం చేశారాయన. ఏలూరు జిల్లా అధ్యక్ష పదవి, నియోజకవర్గ ఇంఛార్జ్ పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పంపారు. వైసీపీ అధికారంలో ఉండగా డిప్యూటీ సీఎం, ఆరోగ్య శాఖ మంత్రిగా నాని పని చేశారు. అయితే.. తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు లేఖలో చెప్పుకొచ్చారు. అయితే ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది..? పార్టీని వీడారు సరే.. రాజకీయాలకే దూరం అని ప్రకటించడమేంటి..? అనేది కార్యకర్తలు, అభిమానులకు అర్థం కావట్లేదు. ఈ రాజీనామా వైసీపీకి ఊహించని దెబ్బ కాగా.. కార్యకర్తలు ఆందోళన చెందుతున్న పరిస్థితి.
ఒప్పిస్తారా..?
నంద్యాల పర్యటనలో బిజిబిజీగా ఉన్న వైఎస్ జగన్.. ఇవాళ సాయంత్రానికి తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుకోనున్నారు. ఆళ్ల నానిని క్యాంప్ ఆఫీసుకు పిలిపించి అసలు సమస్య ఏంటి..? ఏం జరిగింది..? రాజీనామాకు దారితీసిన కారణాలేంటి..? అని అడిగి తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు గత కొన్ని రోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల ఆళ్ల నాని తీవ్ర అసంతృప్తి, అంతకుమించి ఆగ్రహంతో రగిలిపోతున్నారని తెలిసింది. దీనికి తోడు జగన్ కూడా పట్టించుకోవట్లేదని దీన్ని ఆయన అవమానంగా భావిస్తున్నట్లు తెలియవచ్చింది. ఇందులో నిజానిజాలెంత అనేది..? ఇవాళ సాయంత్రంతో ఓ క్లారిటీ రానుంది. ఒకవేళ జగన్ బుజ్జగిస్తే రాజీనామా లేఖను వెనక్కి తీసుకుని పార్టీలో కంటిన్యూ అవుతారేమో చూడాలి మరి.