ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఏ నిమిషాన వైసీపీ ఘోరంగా ఓడిపోయిందో.. నాటి నుంచే పరిస్థితులు అనుకూలించట్లేదు..! కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి వేట మొదలుపెట్టాయి. ఓ వైపు యువనేత నారా లోకేష్ రెడ్ బుక్ ప్రకారం చట్టాన్ని ఉల్లంఘించిన ఐఏఎస్, ఐపీఎస్.. ఇతర అధికారులు చుక్కలు చూస్తుండగా.. వైసీపీ హయాంలో జరిగిన దాడులు, అవినీతిని బయటికి తీస్తోంది సర్కార్. దీంతో వైసీపీ గుర్తు ఫ్యాన్ అయినప్పటికీ నేతలు మాత్రం ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటన నాడు పెద్ద సంచలనమే సృష్టించింది. ఇందులో కర్త, కర్మ, క్రియ యంగ్ లీడర్ దేవినేని అవినాష్ అన్నది టీడీపీ ప్రధాన ఆరోపణ. అధికారంలోకి రాగానే ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే కాకుండా.. ముందస్తు చర్యల్లో భాగంగా లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. అంతేకాదు.. ఈ కేసులో ఇప్పటికే కీలక అరెస్టులు జరగ్గా ఒకట్రెండు రోజుల్లో దేవినేనిని కటకటాల్లోకి పంపిస్తారని టాక్ నడుస్తోంది.
పారిపోలేవులే..!
అసలే కాకలు తీరిన, సీనియర్లు, ముఖ్య నేతలను లెక్కే చేయకుండా అరెస్టులు నడుస్తుండగా.. తన దాకా రావడం పెద్ద విషయమేమీ కాదన్నది అవినాష్‌కు చాలా బాగా తెలుసు. అందుకే వీలైతే విదేశాలకు లేదా ఆంధ్రాలోనే అడ్రస్ లేకుండా ఉండాలని ఫిక్సయ్యారట. ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి దుబాయ్ పారిపోయేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యారు. ఎలాగంటే.. అసలే అవినాష్ మీద కేసులుండటం, పోలీసులు వేట సాగిస్తున్న తరుణంలో భాగ్యనగరంలో ప్రత్యక్షమైన యువనేత శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి దుబాయ్ వెళ్లిపోవాలని ప్లాన్ చేశారు.. అయితే ఎయిర్‌పోర్టు అధికారులు మంగళగిరి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయారు!. మొత్తం ప్లాన్ అంతా రివర్స్ కావడంతో చేసేదేమీ లేక వెనుదిరిగారు అవినాష్.
అబ్బే అదేమీ లేదు!
శుక్రవారం ఉదయం నుంచి అవినాష్ వ్యవహారం మీడియాలో కోడై కూస్తున్న తరుణంలో ఎట్టకేలకు స్పందించారు అవినాష్. తాను ఎక్కడికీ పారిపోలేదని.. తనపై టీడీపీ, దాని అనుకూల మీడియా ఉత్త ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. విజయవాడ నుంచి పారిపోవాల్సిన అవసరం తనకు లేదంటూ ఓ వీడియో రూపంలో క్లారిటీ ఇచ్చుకున్నారు. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించానన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు 24 గంటలూ అందుబాటులోనే ఉన్నానని స్పష్టం చేశారు. అయినా.. నేను దేనికి పారిపోవాలి.. ఎందుకు పారిపోవాలి? అని రిటర్న్‌గా మీడియా, విమర్శకులను ప్రశ్నించారాయన. అంతేకాదు.. దేవినేని నెహ్రూ జన్మనివ్వడమే కాదు ధైర్యం కూడా ఇచ్చారన్నారు. ఇన్నేసి మాటలు మాట్లాడిన తర్వాత కూడా టీడీపీ కూటమి అంత ఈజీగా వదులుందా అన్నది పెద్ద సందేహమే మరి..!