ఆళ్ల నాని.. సౌమ్యుడు, వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి..! వీటి అన్నిటికీ మించి వైఎస్ ఫ్యామిలీ అత్యంత ఆప్తుడు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నమ్మకస్తుడు..! నాడు కాంగ్రెస్ నుంచి నిన్న మొన్నటి వరకూ వైసీపీకి అండగా ఉన్న మనిషి.. ఉన్నపళంగా రాజీనామా చేయడంతో పార్టీలో పెద్ద భూకంపమే వచ్చినట్టు అయ్యింది. పార్టీకి, అధ్యక్ష పదవికి.. ఆఖరికి పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు సరే.. ఇప్పుడు ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏంటి..? ఆయన్ను నమ్ముకున్న క్యాడర్ పరిస్థితి ఏంటి..? వేరే పార్టీలోకి చేరే ఉద్దేశం ఉందా..? లేకుంటే పూర్తిగా రాజకీయాలకు దూరంగా అంటారా..? అనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి.
ఏం జరుగుతోంది..?
పశ్చిమ గోదావరి జిల్లాలో సీనియర్ లీడర్ ఆళ్ల నాని. ఎలాంటి సమస్యలు అయినా సరే చిటికలో పరిష్కరించగలిగే చాణక్యత ఉన్న నేత.. అలాంటి మనిషి అదీ వైసీపీకి ఎందుకు రాజీనామా చేశారా..? అన్నది నాటి నుంచి నేటికీ తెలియక తలలు పట్టుకుంటున్నారు నేతలు.. కార్యకర్తలు. ఒకవైపు పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్లు, నేరుగా జగన్ రంగంలోకి దిగినా సరే వద్దు బాబోయ్.. వద్దు.. నీకో దండం అని చెప్పేసి ఫోన్ కట్ చేశారట. దీంతో ఆయన్ను ఇక పూర్తిగా పక్కనబెట్టి ఏలూరుకు ఎవరిని సెట్ చేయాలి..? ఎవరైతే సరైనోడు అని వెతికే పనిలో హైకమాండ్ నిమగ్నమైంది.
జనసేనలో చేరుతారా..?
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. పార్టీలో కొందరు నేతలు, వైఎస్ జగన్ తీరు నచ్చకనే బయటికి వచ్చారు అన్నది వీరాభిమానులు చెప్పుకుంటున్న పరిస్థితి. అయ్యింది ఏదో ఐపోయింది.. ఇప్పుడు ఏంటి..? పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటారా..? అంటే అస్సలు కానే కాదు అంటున్నారు అనుచరులు. ఐతే.. కొద్ది రోజులు రాజకీయాలకు దూరంగా ఉన్నా మళ్ళీ యాక్టివ్ అయ్యే ఆలోచన ఉందట. అన్నీ అనుకున్నట్లు జరిగితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకునే యోచనలో ఉన్నారట. వాస్తవానికి ఇక్కడ సామాజిక వర్గం కూడా ఒక్కటే.. పైగా జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్న నేతలూ తక్కువే..! అందుకే పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా సమాచారం. ఇదే నిజమైతే డిప్యూటీ సీఎం సమక్షంలో మాజీ డిప్యూటీ సీఎం చేరబోతున్నారు అన్న మాట. ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో..? ఆళ్ల నాని మనసులో ఏముందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదు మరి.