దశాబ్దాల ఘన సాంస్కృతిక, సాహిత్య చరిత్రతో ఎందరో కళాకారుల, సాహిత్యకారుల వైభవానికి కళామతల్లిగా ఆశీర్వదించిన శ్రీ త్యాగరాయ గానసభలో అనేక సంగీత ఉత్సవాలకు, ఉచిత సంగీత, నాట్య తరగతులకు కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు కళా జనార్ధన మూర్తి పర్యవేక్షణలో నూతనంగా ఏడవ ఆడిటోరియంను ప్రారంభించడం శుభ పరిణామమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు కె.వి.రమణాచారి (KV Ramana Chary IAS) పేర్కొన్నారు.
హైదరాబాద్ శ్రీ త్యాగరాయ గానసభలో నూతనంగా ఏర్పాటైన సంగీత నాట్య కళా వేదికను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసిన ప్రముఖ రచయిత, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధికారిక మాసపత్రిక ‘ఆరాధన’ పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ (Puranapanda Srinivas) మాట్లాడుతూ.. సంగీత, నాట్య రంగాలలో క్రొత్త తరాల శిక్షణకోసం శ్రమించి, పరిశ్రమించి మరీ త్యాగరాయ గానసభ (Tyagaraya Ganasabha) అధ్యక్షులు జనార్ధన మూర్తి (Kala Janardhan Murthy) ఇంత వైభవాన్ని మిత్రుల సహకారంతో నిర్మించడం ఏడుకొండలవాడి దయేనని అభినందించారు.
ప్రముఖ పాత్రికేయులు శంకరనారాయణ, త్యాగరాయగాన సభ కమిటీ సభ్యులు చక్రపాణి ప్రసాద్, శ్రీమతి పద్మజ నీలిమ, శ్రీమతి గీత తదితరులు, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. సభలు, సమావేశాలకు సహజంగా దూరంగా వుండే ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ ఈ చక్కని కార్యక్రమానికి హాజరవ్వడంతో పలువురు సాహితీ, సాంసృతిక రంగాల ప్రముఖులు ఆప్యాయంగా పలకరించడం విశేషం.