హైడ్రా.. ఇప్పుడీ పేరు వింటుంటే అక్రమార్కులు, కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. చెరువులు, నాలాలు ఆక్రమించి కట్టిన ఇళ్లపైకి బుల్డోజర్లు వెళ్లిపోతున్నాయి. దీంతో ఎప్పుడు ఎవరి ఇంటికి నోటీసు వస్తుందో.. ఏ టైములో ఇంటి ముందు హైడ్రా టీమ్ వాలిపోతుందో తెలియక ఒక్కటే టెన్షన్. టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ నేలమట్టం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ ప్రపంచ వ్యాప్తంగా హైడ్రా రేంజ్ ఏంటో జనాలకు తెలిసింది. ఇప్పట్లో ఈ కూల్చివేతలు ఆగే పరిస్థితి ఏ మాత్రం కనిపించడం లేదు. సరిగ్గా ఈ టైంలోనే మెగా బ్రదర్, జనసేన కీలక నేత కొణిదెల నాగబాబు సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్ట్ చేశారు.. ఇప్పుడిదే నెట్టింట్లో రచ్చ రచ్చగా మారింది.
బాధాకరం!
తెలుగు రాష్ట్రాల్లో ఎడ తెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా వరద నీరు.. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. ఇంట్లో నుంచి బయటికి వస్తే.. మళ్ళీ తిరిగి వెళ్ళలేని వైనం. ఈ క్రమంలో నాగబాబు చేసిన ట్వీట్ గురుంచి జనాలు తెగ చర్చించుకుంటున్నారు. వర్షాలు పడి తూములు తెగిపోయి, చెరువులు నాళాలు ఉప్పొంగి పోయి అపార్ట్మెంట్లలోకి కూడా నీళ్లు రావడం, కొన్ని సామన్య ప్రాణాలు కూడ బలికావడం చాలా బాధాకరం. వీటికి ముఖ్య కారణం చెరువుల్ని, నాళాలని అక్రమ కబ్జా చేసి నిర్మాణాలు చేయడమే.. అని నాగబాబు రాసుకొచ్చారు.
శభాష్ సీఎం సారు!
ఇప్పటికైనా అర్ధమైందా.. తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేబట్టిన హైడ్రా కాన్సెప్ట్.. నిజంగా మెచ్చుకోదగినది. మీ డేరింగ్ స్టెప్పుకు సంపూర్ణ మద్దతు ఉంటుంది అని నాగబాబు చెప్పుకొచ్చారు. పర్యావరణాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది.. అదే పర్యావరణాన్ని మనం భక్షిస్తే కచ్చితంగా అది శిక్షిస్తుంది.. కచ్చితంగా..! ఇదీ నాగబాబు రాసుకొచ్చిన ట్వీట్ సారాంశం. ఇప్పటికే మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ గా పరిస్థితులు నెలకొన్నాయి. ఇది కాస్త ఎమ్మెల్యే బొల్లిశెట్టి వ్యాఖ్యలతో రచ్చ రచ్చే జరుగుతోంది. ఇప్పుడు నాగబాబు చేసిన ట్వీటుతో .. పవన్ కళ్యాణ్, చిరంజీవిని ప్రశాంతంగా ఉండనివ్వరా..? అంటూ సోషల్ మీడియాలో హడావుడి నడుస్తోంది.
నాగార్జునకు కౌంటరా..?
ఐతే ఈ ట్వీట్ నాగార్జునను ఉద్దేశించి చేసినదే అని అక్కినేని అభిమానులు గుమ్మడి కాయల దొంగ అంటే.. అన్నట్టుగా చంకలు గుద్దుకుని కౌంటర్లు ఇస్తున్నారు. మరోవైపు.. తెలంగాణలో ఏం చేయాలో.. ఏం చేయకూడదో మాకు బాగా తెలుసులే వెళ్లి నీట మునిగిపోయిన అమరావతి సంగతి చూస్కుంటే మంచిది అని గట్టిగానే ఇచ్చి పడేస్తున్నారు. ఇంకొందరు ఐతే అబ్బే అమరావతి గురుంచి ఇండైరెక్టుగా ఇలా మాట్లాడుతున్నారని కామెంట్స్ కూడా వస్తున్నాయ్. మంచి పని చేస్తుంటే మెచ్చుకోవడం కూడా తప్పు అంటే ఎలా అని విమర్శకులకు.. మెగాభిమానులు, జనసేన కార్యకర్తలు గట్టిగా ఇచ్చి పడేస్తున్నారు. ఏమో నాగబాబు ఎవర్ని ఉద్దేశించి చేశారో ఎవరికి ఎరుక!