అవును.. ఏపీ సీఎం నారా చంద్రబాబు కోడలు, మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి ఎక్కడున్నారు..? ఏమయ్యారు..? అడ్రెస్స్ లేదేం..? అప్పుడెప్పుడో బాబు అరెస్ట్, ఎన్నికల ముందు ఆ తరవాత ఎక్కడ చూసినా కనిపించిన ఆమె ఇప్పుడు ఎందుకు ఎక్కడా కనిపించలేదు..? పొలిటికల్ ఎంట్రీ ఉందా లేదా..!? అని టీడీపీ శ్రేణులు ఆలోచనలో పడ్డారు.
ఏమైంది.. లేనట్టేనా?
ఆ మధ్య ఏపీ రాజకీయాలకు బ్రాహ్మణి దూరం అవుతున్నారని.. తెలంగాణ రాజకీయాలకు దగ్గరవుతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే తెలంగాణ టీడీపీ అధ్యక్షురాలిగా నారా బ్రాహ్మణికి పగ్గాలు కట్టబెడతారని అంతా రెడీ అయ్యిందని.. అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉందని టీడీపీ వర్గాలు హడావుడి చేశాయి కానీ ఏమైందో తెలియట్లేదు కానీ ఆ ప్రకటనా లేదు.. బ్రాహ్మణి కూడా కనిపించట్లేదు.
కనిపించలేదేం..!
ఎన్నికల ముందు విజయవాడ, గుంటూరు జిల్లాలో మరీ ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కువగా పర్యటించిన బ్రాహ్మణి.. ఇప్పుడు బెజవాడ వర్షాలు, వరదలతో విల విలలాడుతున్నా ఏమయ్యారో అని వరద బాధితులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ఎన్నికల ముందు హడావుడి చేసిన ఏ ఒక్కరూ ఎక్కడా కనిపించట్లేదు అన్నదానిపై ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయ్. పిఠాపురంలో కాలనీలు, పంట పొలాలు మునిగిపోవడంతో నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరఫున ఎన్నికల ప్రచారం చేసిన బుల్లితెర, వెండితెర నటీ నటులు.. కమెడీయన్లను దుమ్మెత్తి పోస్తున్నారు. అలాగే బ్రాహ్మణి విషయంలోనూ విమర్శలు వస్తున్న పరిస్థితి.
ఎంపీ అవుతారా..?
ఐతే తెలంగాణ టీడీపీ అధ్యక్షురాలు.. లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారని ఆమె అభిమానులు, అనుచరులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పైగా అటు నందమూరి.. ఇటు నారా ఫ్యామిలీ నుంచి వస్తున్న ఆడపడుచు కావడంతో అభిమానులు ఎదురుచూపుల్లో ఉన్నారు. ఐతే.. ఇంత వరకూ ప్రకటన కూడా రాలేదు. మరోవైపు.. ఏపీ నుంచి బ్రాహ్మణిని రాజ్యసభకు పంపే అవకాశం కూడా ఉందనే చర్చ కూడా నడుస్తోంది. మరి రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న ఆమెతో ఎంట్రీ ఇప్పిస్తారో.. లేదంటే వ్యాపార రంగానికే పరిమితం చేస్తారో లేదో చూడాలి మరి.