అవును.. ఇప్పుడు అందరి నోటా ఒకటే మాట..! వర్షాలు వచ్చాయ్.. వరదల థాటికి విజయవాడ విలవిలలాడగా.. అమరావతి సంగతి ఏంటో పైనున్న అమ్మవారికే తెలియాలి..! ఇప్పుడు ఒకింత వర్షానికే పరిస్థితి ఇలా ఉంటే భవిష్యత్తులో తుపాన్, అతి భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఏంటి..? ఇప్పుడు అక్కడ రాజధాని కట్టడానికి వీలు అవుతుందా లేదా..? ఒకవేళ కడితే ఏం చేయాలి..? నిపుణులు ఏమంటున్నారు..? ప్రభుత్వం ఏం చేయాలని భావిస్తోంది..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి మరి.
ప్రజలకు చెప్పాల్సిందే!
ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా.. వరదల ధాటికి అమరావతి చాలా వరకు నట్టేటా మునిగింది. లేదు అదంతా అవాస్తవం అని టీడీపీ అనుకూల మీడియాలో రాపించిన ప్రత్యేక కథనాలన్నీ సోషల్ మీడియా దెబ్బకు తేలిపోయాయి. ఇలాంటి పరిస్థితులను కళ్ళారా చూసిన యావత్ ప్రపంచం చూసింది. ఇప్పుడు రాజధాని కట్టడానికి అమరావతి ఏ మాత్రం అనువైనది..? ఒకవేళ అక్కడే కట్టినా ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది..? ఎలాంటి టెక్నాలజీతో ముందుకెళ్తోంది..? వరదల దెబ్బ తగలకుండా ఎలాంటి శాశ్వత చర్యలు తీసుకుంటుంది..? రేపు పొద్దున్న దేశ విదేశాల నుంచి వచ్చే కంపెనీలకు కూటమి ప్రభుత్వం ఇచ్చే భరోసా ఏమిటి..? ఇలా ఒకటి రెండు కాదు వందలాది ప్రశ్నలకు సమాధానాలు సర్కార్ నుంచి వచ్చి తీరాల్సిందే.
ఏం చేయాలి.. ఎలా..?
రాజధాని అమరావతితో పాటు.. ఇప్పుడు వరదల థాటికి గజ గజ వణికిన బెజవాడను మరోసారి ఇలా చూడకుండా ఉండాలన్నా కచ్చితంగా గట్టి చర్యలు తీసుకోవాల్సిందే. విజయవాడలో డ్రైనేజీ వ్యవస్థ సమూల ప్రక్షాళన జరిగి తీరాల్సిందే. ప్రకాశం బ్యారేజీకి ప్రవాహ సామర్థ్యం పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. వచ్చిన వరద నీటిని వచ్చినట్టే బయటికి పంపించే పరిస్థితి రావాలి. దీనికి తోడు ఎట్టి పరిస్థితుల్లోనూ బుడమేరు ఆక్రమణలను తొలగించితే తప్ప.. మరోసారి బెజవాడ ఇబ్బందికి గురికాకుండా ఉంటుంది. లేని పక్షంలో ఇంతకు మించి నష్టమే ఉండొచ్చు. ఇక అమరావతి విషయానికి వస్తే.. రాజధాని నిర్మాణంలోనే సమగ్ర నీటి పారుదల వ్యవస్థ నిర్మించాలని నిపుణులు చెబుతున్న మాట..
అయ్యే పనేనా..!?
కృష్ణలంక గ్రామాలకు ఏవిధంగా ఐతే రిటైనింగ్ వాల్ గత ప్రభుత్వం నిర్మించిందో.. అలానే ఇప్పుడు అమరావతికి రక్షణగా అంతకు మించి కాంక్రిట్టు కట్టడం ఉండాల్సిందే అని నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో రాజధానిలోకి చుక్క నీరు ప్రవేశించకుండా.. అమరావతి చుట్టూ పటిష్ఠమైన కాంక్రీట్టు కట్టడం నిర్మించాలి. ఇక ఎలాగో గ్రీన్ ఫీల్డ్ నగరమని అమరావతిని చెప్పుకుంటున్నారు కనుక నిర్మాణ దశలోనే అత్యాధునిక మురుగు, వరద నీరు పారుదల వ్యవస్థలు ఏర్పాటు చేస్తే రాజధాని సేఫ్ అవుతుంది. ఇది ఎంతవరకు అయ్యే పని..? అమరావతి తక్కువలో తక్కువ 33 వేల ఎకరాల పైచిలుకు ఉంది. ఈ మొత్తానికి గోడ.. లేదా కాంక్రీట్టు కట్టడం అంటే అయ్యే పనేనా..? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒకవేళ ఇదే చేసి తీరాల్సిందే అంటే ఈ నిర్మాణానికి లక్షల కోట్ల రూపాయలు కావలసిందే. నిపుణుల అంచనాల ప్రకారం.. అమరావతి మునకప్రాంతం కనుక 55 వేల ఎకరాల చుట్టూ మూడు లక్షల కోట్లతో రిటైనింగ్ వాల్ కట్టాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు. మరి ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో అది అయ్యే పనేనా..? లేదంటే.. పోనీ రాజధాని మార్చే పరిస్థితి ఉందా అంటే అస్సలు అది అయ్యే పని ఏ మాత్రం కానే కాదు. మరి విజనరీ లీడర్ చంద్రబాబు మనసులో ఏముందో.. ఏం చేయాలని ఉందో ఏంటో చూడాలి మరి.