తిరుమల లడ్డూపై యావత్ దేశ వ్యాప్తంగా రచ్చ రచ్చ జరుగుతోంది. వైసీపీ హయాంలో టీటీడీని భ్రష్టు పట్టించారని టీడీపీ, జనసేన సంచలన ఆరోపణలు చేస్తోంది. మొత్తం జగన్ హయాంలో జరిగిన ఈ తప్పులకు ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేపట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 11 రోజుల దీక్ష తర్వాత తిరుమల వెళ్లనున్నారు. అటు టీడీపీ, బీజేపీ నుంచి.. ఇటు వైసీపీ నుంచి ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడేస్తున్నారు. దీంతో ఏపీలో చిన్నపాటి యుద్ధమే నడుస్తోందని చెప్పుకోవచ్చు. అవును మేం తప్పు చేశాం కదా సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి అని వైసీపీ డిమాండ్ చేస్తోంది. అంతే కాదు ఈ ఆరోపణలపై ప్రధాని మోదీ కూడా స్పందించాలనే డిమాండ్ వైసీపీ నుంచి సర్వత్రా వస్తోంది.
శ్రీవారే చూసుకుంటారుగా!
ఈ వివాదంపై ఇంత వరకూ ఒక్క కేసు లేదు, ఎఫ్ఆర్ లేదు, ఆఖరికి సీబీఐ విచారణ కూడా లేదు. కేవలం రాజకీయ ఆరోపణలకే టీడీపీ, వైసీపీ పార్టీలు పరిమితం కావడం గమనార్హం. పోనీ వైసీపీ తప్పు చేసింది నిజమైతే సీబీఐ లేదా సుప్రీంకోర్టు జడ్జితో విచారణకు డిమాండ్ చేస్తే కూటమి ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమిటి..? నిజం ఐతే దోషులకు శిక్ష పడుతుంది.. మిగిలిన కార్యాలన్నీ ఏడుకొండల వెంకన్నే చూసుకుంటారు కదా..? ఒకవేళ తప్పు జరగలేదని తేలితే ఒప్పు అని ఒక్క దెబ్బతో లడ్డూ లడాయికి ఫుల్ స్టాప్ పడుతుంది కదా. తప్పు జరగలేదని అంత ధైర్యంగా, ధీమాగా వైసీపీ చెబుతుంటే.. లడ్డూలో కల్తీ జరిగిందని నిరూపించడానికి టీడీపీ కూటమి సర్కార్ ఎందుకు ఇంతలా భయపడుతోంది..? సీబీఐ విచారణ అంటే కనీసం స్పందించకుండా దాట వేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నట్టు..? అన్నది పైనున్న శ్రీవారికి.. కిందున్న చంద్రబాబుకే తెలియాలి.
ఎందుకిలా..?
అయినా.. లడ్డూల సమస్యపై స్పందించడానికి రెండు నెలలు ఎందుకు పట్టింది..? అన్నది ఇప్పుడు ఎవరి నోట విన్నా వస్తున్న మాట. దీనికి తోడు తిరుమల శ్రీవారి ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు చెప్పి సైలెంట్ అవ్వడం ఏంటి..? సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్ చేయకుండా ఎందుకు మిన్నకుండి పోయారు..? అని సొంత పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి ఒకింత డిమాండ్ వస్తోంది. మరోవైపు మంత్రి నారా లోకేష్ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీకి, సీఎంకు సంబంధం ఉండదని కేవలం ఈవోని అపాయింట్ చేయడం మాత్రం ముఖ్యమంత్రి పని, ఎందుకంటే టీటీడీ బోర్డు ఒక స్వతంత్ర సంస్థ అని చెప్పడం గమనార్హం. ఇదే మాట.. 2019-2024లో ఉన్న సీఎంకు టీటీడీకి ఏంటి సంబంధం..? అనే ప్రశ్నకు ఎందుకు సమాధానం రావడం లేదని కొన్ని వర్గాలు, కొందరు రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్న ప్రశ్నలు.
మిగిలింది పవన్ మాత్రమే!
మొత్తానికి చూస్తే.. ఆరోపణలు చేసి చంద్రబాబు సైలెంట్ అవ్వగా, ఇక లోకేష్ మాత్రం అదంతా స్వతంత్ర సంస్థ అని చెప్పి చేతులు దులుపుకోగా.. ఇప్పుడు దీనిపై గట్టిగా పట్టు బట్టింది, ప్రాయశ్చిత్త దీక్ష దిగింది పవన్ కళ్యాణ్ మాత్రమే. దీంతో అందరూ సైడ్ అయ్యి డిప్యూటీ సీఎంను ఇరికించారని ఒకింత జనసైనికులు ఆందోళన, అసంతృప్తి చెందుతున్న పరిస్థితి. దీనికి తోడు.. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కూడా ట్రోల్ అవుతున్నది కూడా సేనానినే. దీక్ష చేపట్టిన అనంతరం పవన్ మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. ఇలాంటి అపవిత్రం ఒక చర్చి మీద జరిగిన, ఒక మసీదు మీద జరిగిన దేశం అల్లకల్లోలం చేస్తారు.. గ్లోబల్ న్యూస్ అయిపొద్దనీ.. కానీ దేశంలో కోట్లాది మంది హిందువుల ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరు కూడా మాట్లాడకూడదు అంటే ఎలా..? అని పవన్ ప్రశ్నించారు.
ఎంత విచిత్రమో..!
ఈ లడ్డు వ్యవహారంతో విచిత్రం ఏమిటంటే.. ఎక్కడైనా తప్పు జరిగితే అధికారంలో ఉన్నోళ్ళు విచారణ చేసి శిక్షపడేలా చేస్తారు అంతే కదా. కానీ ఏపీలో ఎందుకో సీన్ అంతా రివర్స్ గా ఉంది. నింద పడ్డ వైసీపీనే సీబీఐ ఎంక్వయిరీ అడుగుతున్నా.. కూటమి సర్కార్ అడుగు ముందుకు వేయకుండా ఉండటం గమనార్హం. ఇది డైవర్షన్, రాజకీయం ఏ మాత్రం కాదు అన్నప్పుడు ధైర్యంగా సీబీఐ విచారణకు ఆదేశిస్తే పోయేది ఏముంది. పోనీ టీడీపీ సైలెంట్ అయ్యింది సరే.. బీజేపీ, జనసేన, ఇతర ధార్మిక సంఘాలు ఏమైనట్టు..? నిత్యం హిందూ హిందూ అని తెగ హడావుడి చేసే సో కాల్డ్ సంఘాలు ఏమైనట్టు..? అని సామాన్య ప్రజల నుంచి సైతం ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
అటు దాడి.. ఇటు లేఖ!
ఇదిలా ఉంటే.. తాడేపల్లిలోని జగన్ రెడ్డి ఇంటిని బీజేపీ కార్యకర్తలు ముట్టడించారు. జై శ్రీరామ్.. డౌన్ డౌన్ వైఎస్ జగన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో జగన్ ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరకొట్టడంతో పరిస్థితులు అదుపులోనికి వచ్చాయి. ఈ క్రమంలోనే ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖ కూడా రాశారు. నాలుగు పేజీల లేఖలో పథకం ప్రకారం తితిదే ప్రతిష్ఠ దెబ్బ తీసేందుకు సీఎం చంద్రబాబు కుట్ర చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. స్వార్థ రాజకీయాల కోసం దేవుడిని వాడుకుంటున్నారని తక్షణం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని జగన్ లేఖలో రాడుకొచ్చారు. దీనిపై ఎలాంటి రిప్లై వసుందో..? మోదీ కూడా లెటర్ చూసి, చదివి సైలెంట్ అవుతారా..? ఏదైనా చర్యలు లేదా సీబీఐ విచారణకు అదేశిస్తారేమో చూడాలి మరి.