అవును.. ఈ మాటలు అన్నది జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇవాళ్టి నుంచి పల్లె పండుగ వారోత్సవాలు ప్రారంభం అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13,324 గ్రామాల్లో ఒకేసారి వారోత్సవాలు షురూ అయ్యాయి. దాదాపు రూ. 4,500 కోట్ల వ్యయంతో 30 వేల పనులను ప్రభుత్వం చేపట్టనున్నది. కంకిపాడులో జరిగే పల్లె పండుగ వారోత్సవాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. కార్యక్రమంలో రాజకీయాలు, సినిమాలపై కూడా ప్రస్తావించారు. పవన్ మాట్లాడుతున్నంత సేపు అభిమానులు, కార్యకర్తలు ఈలలు కేకలతో హోరెత్తించారు. ఇంతకీ డిప్యూటీ సీఎం ఏం మాట్లాడారు..? సినిమా ఇండస్ట్రీ గురుంచి ఏమన్నారు..? సీఎం చంద్రబాబు గురుంచి పవన్ చేసిన వ్యాఖ్యలు ఏమిటి..? అనేవి ఇప్పుడు తెలుసుకుందాం వచ్చేయండి.
అందుకే కలిసి పోటీ..!
సీఎం నారా చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి బలం అని.. అందుకే కలిసి పోటీ చేయాలని ఆనాడే నిర్ణయం తీసుకున్నట్లు పవన్ స్పష్టం చేశారు. ఏపీలో యువతకు ఉపాధి అవకాశాలు లభించాలన్నారు. టీడీపీతో కలిసి పోటీ చేయాలనే నిర్ణయం వల్ల ఇప్పుడు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని.. ప్రభుత్వ పనితీరు పారదర్శకంగా ఉండాలని ఆకాంక్షించారు. మాతో పాటు అధికారులు కూడా నిజాయితీగా ఉండాలి.. లంచం తీసుకున్న అధికారిపై వెంటనే చర్యలకు ఆదేశించారు పవన్.
బోర్డులు తప్పనిసరి..
ఇదిలా ఉంటే ఇదే సభా వేదికగా సినిమాలపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైనా సరే ముందు బాధ్యతలు ముఖ్యమని.. ఆ తర్వాతే సినిమాలు అని డిప్యూటీ చెప్పుకొచ్చారు. ప్రజలు తమ పంచాయతీల్లో ఏం పనులు జరగాలో వాళ్లే తీర్మానం చేసుకున్నారు. గ్రామంలో ఎంత ఖర్చు పెట్టాం.. ఏయే పనులు జరుగుతున్నాయో.. డిస్‌ప్లే బోర్డులు ఉండాలి.. పరిపాలన వేరు.. పాలిటిక్స్ వేరు అని డిప్యూటీ సీఎం చెప్పుకొచ్చారు.
సినిమాలపై..
సభలో ఓజీ అంటూ అభిమానుల నినాదాలు చేశారు. అప్పుడే ఇక సినిమాలు గురుంచి పవన్ మాట్లాడారు. చాలా కాలం నాకు OG, OG అంటే మోడీ, మోడీ అని వినిపించేదన్నారు. ముందు బాధ్యత.. ఆ తర్వాతే వినోదం అని ఒక్క మాటలో చెప్పేశారు. సినిమాల్లో ఎవరితోనూ నేను పోటీ పడను. ఒక్కో స్థాయిలో ఒక్కొక్కరు నిష్ణాతులు. అందరూ బాగుండాలని నేను కోరుకుంటా. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాకే వినోదాలు, విందులు టాలీవుడ్‌లో ఎవరితోనూ నేను పోటీపడనని స్పష్టం చేశారు.
అందరూ బాగుండాలి..
నేను సినిమా చేయాలంటే డబ్బులు కూడా ఉండాలి. సినిమా హీరోలు ఎవరైనా బాగుండాలని కోరుకుంటా. సినిమా ఇండస్ట్రీ బాగుండాలంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుండాలి..రాష్ట్రాన్ని బాగుచేసుకుని ఆ తర్వాత విందులు, వినోదాలు చేసుకుందాం. నా సినిమా టిక్కెట్లు కొనాలి అంటే మీకు (అభిమానులు, కార్యకర్తలు) పని ఉండాలి. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, మహేష్ బాబుగారు, తారక్ గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, నాని గారు.. ఇలా పేర్లు చెబితే పెద్ద లిస్టే ఉంటుంది.. అందరూ బాగుండాలి అని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.