వైసీపీ హయాంలో ఓ వెలుగు వెలిగి.. సకల శాఖా మంత్రిగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణా రెడ్డి ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ఎంతలా అంటే.. కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలి బయటికి అడుగు పెట్టలేని పరిస్థితి. దీనంతటికీ కారణం అధికారం ఉన్నప్పుడు ఇష్టానుసారం వ్యవహరించడమే. వైసీపీ హయాంలో మంగలగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై కొందరు వైసీపీ కార్యకర్తలు, నేతలు దాడి చేసి విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. నాడు కేసులు నమోదు చేసిన పోలీసులు మమా అనిపించారు. ఐతే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చీ రాగానే పాత కేసులు అన్నీ బయటికి తీయడం మొదలు పెట్టింది. ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేసిన పోలీసులు.. తాజాగా సజ్జలకు మంగళగిరి పోలీసుల నోటీసులు జారీ చేశారు. దీంతో దాడి కేసు కీలక మలుపు తిరిగింది.
ఏమవుతుందో..?
దాడి కేసులో ఇన్ని రోజులు వైసీపీలోని మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను విచారిస్తూ వచ్చిన పోలీసులు ఇప్పుడు కీలక వ్యక్తులకు నోటీసులు ఇచ్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగానే సజ్జలకు బుధవారం నాడు నోటీసులు జారీ చేశారు పోలీసులు. గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల లోపు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. వైసీపీ కీలక నేత కావడం, పార్టీలో పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్న ఈ పరిస్థితుల్లో నోటీసులు రావడం, విచారణ ఎదుర్కోవాల్సి రావడం వైసీపీకి ఒకింత గడ్డు కాలమే అని చెప్పుకోవచ్చు.
నన్నేం చేస్తారు..?
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మళ్ళీ నోటీసులు ఇవ్వటంపై సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. ఎన్నికల హామీలను గాలికొదిలేసి, వేధింపులను మాత్రం తీవ్ర స్థాయికీ తీసుకెళ్ళారని అభిప్రాయ పడ్డారు. నేను విదేశాలకు వెళ్లానని లుకౌట్ నోటీసులు ఇచ్చారు. కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్ళాను. మాకు న్యాయస్థానలపై నమ్మకం ఉంది. ఆఫీస్ మీద దాడి కేసు ఎప్పుడో క్లోజ్ అయింది. ఇప్పుడు దాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు. అసలా దాడికి కారణమే టీడీపీ నేతలు జగన్ గారిని అసభ్యంగా తిట్టి రెచ్చగొట్టారు. దాంతోనే గొడవలు జరిగాయి.. అని సజ్జల చెప్పుకొచ్చారు.
ఇదేంటి..?
వాస్తవానికి.. అప్పుడప్పుడే టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగితే ఇప్పుడు మళ్లీ కొత్తగా కూటమి ప్రభుత్వం నోటీసులు పంపడం ఏంటి..? అని వైసీపీ ప్రశ్నిస్తోంది. కేసు ముగిసే సమయానికి నోటీసులు ఏంటి? ఏమాత్రం బేస్‌లేని విషయాలలో నోటీసులిచ్చి ఏం చేయాలని అనుకుంటున్నారు?.. అధికారం ఉందని తప్పుడు కేసులు బనాయిస్తే ఎలా? అని సజ్జల, వైసీపీ ప్రశ్నిస్తోంది. ముందస్తు బెయిల్ కోసం వెళ్లినప్పుడు లిస్టులో పేరు లేదని చెప్పారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తర్వాత ఎవరో కన్‌ఫెషన్ ఇచ్చారంటూ ఎఫ్ఐఆర్ లో పేరు చేర్చారని.. దేనికైనా న్యాయస్థానాల్లో తేల్చుకుంటాం.. తప్పుడు కేసులు పెట్టే అలవాటు మీది.. మీరు పెంచి పోషించేవారికి ఉందని సజ్జల చెప్పుకొచ్చారు. గురువారం నాడు సజ్జల ఏం చేయబోతున్నారు..? పోలీసులు ఏం చేస్తారో చూడాలి మరి.