వైఎస్ జగన్.. వైఎస్ షర్మిల అదేనండోయ్.. అన్నా చెల్లి మధ్య ఆస్తుల పంపకాలు దాదాపు పూర్తయ్యాయ్.. ఒకటి రెండు విషయాల్లో మాత్రమే పెండింగ్.. దీంతో గొడవలు ఇక ఉండవ్.. రాజీపడ్డారు! ఇవీ గత 48 గంటలుగా ఎక్కడ చూసినా వినిపిస్తున్న, కనిపిస్తున్న మాటలు. అయితే ఇందులో నిజమెంత..? ఏయే విషయాల్లో క్లారిటీ వచ్చింది..? ఇంకా ఏ పంపకాల్లో తేడా వచ్చింది..? ఇవన్నీ కాదు రాజీ నిజమేనా..? నిజమే అయితే నెక్స్ట్ ఏంటి..? ఇదే ఇప్పుడు అటు జగన్.. ఇటు షర్మిల వీరాభిమానులు, అనుచరుల్లో వస్తున్న సందేహాలు.
అసలేం జరుగుతోంది..?
ఎన్నికల అఫిడవిట్ ప్రకారం జగన్‌కు రూ. 757 కోట్లు, షర్మిలకు రూ. 182 కోట్లు ఆస్తులు ఉన్నాయని తేలింది. ఆస్తి ఉన్నా అప్పు మాత్రం 82 కోట్లు అన్నకు.. రూ. 19 లక్షలు వదినమ్మ భారతీకి ఇవ్వాల్సి ఉందని క్లియర్‌గా రాసుకొచ్చారు షర్మిల. ఇక రూ. 4.61 కోట్ల వజ్రాభరణాలు ఉన్నాయి. ఇవన్నీ అటుంచితే.. వైసీపీ ఆవిర్భావం, ఆ తర్వాత జగన్ జైలుకెళ్లడం, 2014 ఎన్నికల వరకూ అంతా సవ్యంగానే సాగినా 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనను పట్టించుకోవట్లేదని సైడ్ అయ్యారు షర్మిల. నాటి నుంచి నేటి వరకూ ఆస్తి పంపకాలు జరపాల్సిందేనని పట్టుబట్టి కూర్చున్నారు. అయితే.. ఇద్దరి మధ్య సయోధ్యకు అటు ఇటు సన్నిహితులు ప్రయత్నించినా అబ్బే అస్సలు కాలేదు.
హ్యాపీనే కదా..!
అన్నాచెల్లి ఒక్కటయితే ప్రశాంతమే కానీ ఒక్కటయ్యారా లేదా అన్నది ఇప్పటికీ ఎవరికీ అర్థం కాని విషయం. ఎందుకంటే.. బెంగళూరు వేదికగా ఆస్తుల పంపకం జరిగిందని కొందరు అంటుంటే.. అబ్బే అదంతా ఉత్తుత్తే అని ఇంకొందరు అంటున్నారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలను పక్కదోవ పట్టించడానికి ఓ వర్గం మీడియా ఇంత హడావుడి చేస్తోందని మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి. దీనికి తోడు లోటస్‌పాండ్ షర్మిలకు.. బెంగళూరులోని యలహంక ప్యాలెస్ జగన్‌కు అని.. ఇలా కొన్ని పంపకాలు పూర్తవ్వగా రెండు విషయాల్లో మాత్రం సఖ్యత కుదరట్లేదన్నది సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ. ఇదే నిజమే అనుకుంటే ఇద్దరూ ఒక్కటైనట్లే.. రాజీ పడినట్లే కానీ సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే వైసీపీని వదలను అంటూ షర్మిల చేసిన ట్వీట్‌తో మళ్లీ ఆస్తుల పంపకాల్లేదు.. ఏం కాలేదు యవ్వారం మొదటికొచ్చిందనే చర్చ కూడా జరుగుతోంది. రాజీ నిజమైతే ఇరువురికీ హ్యాపీ.. ఏదో ఒకరూపంలో షర్మిలనే ప్రకటన చేస్తారు కూడా. ఈ రాద్ధాంతానికి ఎవరు ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి.