రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న క్రేజీ మూవీ రాజా సాబ్. అక్టోబర్ 23 ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఈ మూవీ నుండి వస్తున్న అప్డేట్స్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తున్నాయి. తాజాగా ఈ మూవీ నుండి ఓ మోషన్ పోస్టర్‌ను వదిలారు. ఇది ప్రభాస్‌లోని మరో కోణాన్ని తెలియజేస్తోంది. చంద్రముఖి సినిమాలో రజినీకాంత్ ఎలా అయితే కనిపించారో.. అలా ఈ మోషన్ పోస్టర్‌లో ప్రభాస్ మేకోవర్ అయ్యారు.
ప్రభాస్ కెరీర్‌లో ఇప్పటి వరకు ఇలాంటి సినిమా చేయలేదనే విధంగా ఈ మోషన్ పోస్టర్ ఉంది. కింగ్ అవతార్‌లో చేతిలో సిగార్‌తో ప్రభాస్‌ని ఇలా చూసిన వారెవరైనా అయ్యబాబోయ్ అనాల్సిందే. అసలు ప్రభాసేనా? మారుతి ఏదో ప్లాన్ చేస్తున్నాడు అన్నట్లుగా ఈ పోస్టర్ చూసిన వారంతా మాట్లాడుకుంటుండటం విశేషం. ఎందుకంటే ఆయన కూర్చున్న తీరు, ఆ సింహాసనం చూస్తుంటే.. భూతాల మాంత్రికుడిలా ప్రభాస్ కనిపిస్తున్నారు. అందులోనూ రాజసం ఉట్టిపడుతుండటమనేది ప్రభాస్ గ్రేట్‌నెస్‌గా చెప్పుకోవచ్చు.
మొట్టమొదటి సారి ఓ హర్రర్ ఫిల్మ్‌లో ప్రభాస్ నటిస్తోన్న ఈ రాజా సాబ్ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ హారర్ జానర్‌లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ మోషన్ పోస్టర్‌తో ఈ సినిమాపై అందరిలో మరింతగా క్యూరియాసిటీ పెరుగుతోంది.