సాయిరెడ్డి ట్రాప్‌లో టీడీపీ కూటమి!
అవును.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్రాప్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు పడిపోయాయి. ఆయన ఏం మాట్లాడినా కౌంటర్లు ఇవ్వడం, రివర్స్ అటాక్ చేయించుకోవడమే పనిగా రెండు మూడ్రోజులుగా నడుస్తోంది. సాయిరెడ్డి ఏమో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఆహా, ఓహో అని మాట్లాడటం.. దానికిపై జనసేన పొంగిపోతుండటంతో తెలుగు తమ్ముళ్లకు మండిపోతోంది. సీఎం చంద్రబాబునే తక్కువ చేసి, వయస్సు అయిపోయిందని మాట్లాడుతావా? అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక బీజేపీ అయితే అబ్బే.. మీరు మీరు కొట్టుకోండి మాకెందుకు? అంటూ సైలెంట్ అయిపోయింది. ఇక సోషల్ మీడియా వేదికగా అయితే అబ్బో టీడీపీ, జనసేన కార్యకర్తలు, నేతల మాటలు, పంచ్‌లు మాటల్లో చెప్పలేం అంతే.
అవసరమా?
అవును.. చంద్రబాబుకు వయస్సు అయిపోయిందే అనుకోండి.. సాయిరెడ్డికి వచ్చిన ఇబ్బందేంటి? ఆయన గురించి మాట్లాడేటప్పుడు తమరి వయసెంత? ఆ లెక్కన మాట్లాడితే ప్రధాని నరేంద్ర మోదీ వయసెంత? మన చుట్టు పక్కల రాష్ట్రాలను, దేశాలను పాలిస్తున్న ముఖ్యమంత్రులు, ప్రధానులు, దేశాధ్యక్షుల వయసు ఎంత? అనేది కూడా తెలుసుకుని మాట్లాడాలి కదా. పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఉండొచ్చు.. లేదంటే ఆయన్నుంచి తమరు ఇంకోటేదైనా ఆశించి ఉండొచ్చు కానీ, ఇలా ఒకరిని ఎక్కువ మరొకర్ని తక్కువ చేసి మాట్లాడటం, హేళన చేయడం ఎంతవరకూ సబబు? ఇవే మాటలు టీడీపీ నేతలు, కార్యకర్తల నుంచి వస్తే తమరు ఊరుకుంటారా? ఒంటికాలిపైన లేవరా? అవసరమా లేని పోని తలనొప్పులు. ఇవన్నీ కాదు కాకినాడ పోర్టు వ్యవహారం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడటం లేదు గనుక ఆయన్ను ఆకాశానికెత్తాలంటే కానివ్వండి అంతేగానీ ఇవన్నీ అనవసరం అంటూ తెలుగు తమ్ముళ్లు హితవు పలుకుతున్నారు.
నిరూపించుకో..?
కాకినాడ పోర్టు వ్యవహారంలో కేవీ రావు చెప్పే మాటలన్నీ అబద్ధం అని చెబుతున్నారు అంతే కదా.. అదేదో నిరూపించుకుంటే సరిపోతుంది కదా. అయినా రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ఈ విషయాన్ని ఎందుకు లైట్ తీసుకుంటోందన్నది ఇప్పటికీ సమాధానం దొరకని ప్రశ్న. అసలే పార్టీ ఓడిపోవడం, పార్టీ నేతలు.. కార్యకర్తలపై కేసులు, జంపింగ్‌లతో ఫ్యాన్ పార్టీకి ఎక్కడలేని కష్టాలు వచ్చిపడ్డాయి. ఓ వైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ బలోపేతం, జనాల్లోకి వెళ్లి ప్రజా సమస్యలపై పోరాటానికి పూనుకుంటూ ఉంటే సాయిరెడ్డి మాత్రం చంద్రబాబును పరోక్షంగా విమర్శిస్తూ, పవన్‌ను పొగుడుతూ నానా హడావుడి చేస్తున్నారు. అవును పవన్ పగ్గాలి చేపట్టాలి, పవన్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమనుకుంటే అదేదో జనసేన కండువా కప్పుకొని ఆయన నాయకత్వంలో బలోపేతం చేయొచ్చు కదా అని వైసీపీ కార్యకర్తలు సైతం చిరాకు పడుతున్న పరిస్థితి. అయితే ఆయన ఏం మాట్లాడినా సరే టీడీపీ మాత్రం ట్రాప్‌లో పడిపోవడం గమనార్హం. ఇంకెన్ని ట్వీట్లు చేస్తారో.. ఏమేం జరుగుతుందో చూడాలి మరి.