గత రెండు రోజులుగా మంచు కుటుంబంలో రాజుకున్న వివాదం అందరికి తెలిసిందే. సినిమాటిక్ స్టయిల్లో గంటగంటకు ఓ మలుపు తిరుగుతూ ఉత్కంఠభరితంగా సాగుతుంది మంచు వారి ఇంటి ఘర్షణ. ఈ నేసథ్యంలో మంచు మనోజ్ ని ఉద్దేశిస్తూ.. మోహన్ బాబు ఉద్వేగంగా మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో స్త్రోతలను కాస్త కదిలించింది. అంతలోనే ఇంటివద్ద జరిగిన నాటకీయ పరిణామాలు మళ్ళీ కొత్త మలుపు తీసుకున్నాయి. మనోజ్ విషయంలో తీవ్ర అసహనానికి గురైన మోహన్ బాబు అతనిపై తన లైసెన్సుడు రివాల్వర్ గురి పెట్టి బెదిరించడం కలకలం రేపింది. పోలీసులు మోహన్ బాబు గన్ లైసెన్స్ క్యాన్సిల్ చేసేవరకు వెళ్ళింది వ్యవహారం.
అలాగని ఈ పంచాయతీ ఇక్కడితో ఆగిపోలేదు, యాక్షన్ సినిమా టైప్ లో ఇంకాస్త టెంపో పెంచుతూ మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నలకు మోహన్ బాబు తీవ్ర అసహనానికి గురై దుర్భాషలాడేవరకు వెళ్ళింది, దానితో పాటు అదే ప్రష్టేషన్ మీడియా వారిపై మోహన్ బాబు దాడికి దిగడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తుంది, ముఖ్యంగా మీడియా వారి చేతిలో మైక్ లాక్కుని వారిని కొట్టే ప్రయత్నం చెయ్యడం, అయ్యప్ప మాలధారి పై చెయ్యి చేసుకోవడం యావత్ జర్నలిస్ట్ లందరి ఆగ్రహానికి గురైంది.
తనపై దాడికి నిదర్శనంగా ఇంటి నుంచి బయటికి వచ్చి అందరి దృష్టిలో మనోజ్ సానుభూతి పొందితే, సహనం కోల్పోయిన మోహన్ బాబు తనని తనే ఈ ప్రహసనంలో విలన్ గా మార్చుకున్నారు. అయితే ఇంతటి ఘర్షణలోనూ విష్ణు మాత్రం స్థిత ప్రజ్ఞత చూపించడం విశేషం, అటు తండ్రిని సెక్యూర్ చేస్తూనే ఇటు తానేమి వాగ్వాదానికి, ఘర్షణకు దిగకుండా స్వీయ నియంత్రణ చూపించాడు, ఆపై ఈసంఘటన తాలూకు ప్రభావంతో తీవ్ర అస్వస్థతకు గురైన తండ్రి మోహన్ బాబు ని ఆఘమేఘాల మీద హైదరాబాద్ గచ్చిబౌలి లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో జాయిన్ చేసారు. ప్రస్తుతం ఎమెర్జెన్సీ వార్డులో వైద్యుల పర్యవేక్షణలో మోహన్ బాబుకు చికిత్స కొనసాగుతుంది.
మోహన్ బాబు ఇంటిపేరు మంచు వలే ఈఘర్షణ కూడా అతి త్వరలోనే మంచులా కరిగిపోవాలని మళ్లీ ఆ కుటుంబం కలిసిపోవాలని సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఆశిస్తున్నారు.