చాలా అరుదు.. మెగా బ్రదర్స్ కే సాధ్యం!
అవును.. ఆంధ్రపదేశ్ రాజకీయాల్లో కొన్ని కొన్ని సంఘటనలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఇప్పటి వరకూ తండ్రి కొడుకు, కుమార్తె, భార్య లేదా తమ్ముడిపై అన్న.. అన్నపై తమ్ముడు ఎన్నికల్లో పోటీ చేయడం లేదా వేర్వేరు నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలవడం సర్వసాధారణమే. ఇందులో ఇంచు మించు ప్రతి జిల్లాలోనూ జరుగుతున్న విషయాలే. గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇంటికే పరిమితం అయిన వాళ్ళూ ఉన్నారు. తండ్రీ కొడుకులు, తండ్రీ కూతుళ్ళు, భార్యా భర్తలు, వియ్యంకులు, బావా బామ్మర్ది ఎమ్మెల్యేలుగా ఉండొచ్చు కానీ.. అన్నదమ్ముళ్ళు మంత్రులుగా ఉండటం అనేది రాష్ట్ర రాజకీయాల్లో చాలా అరుదుగా జరిగే ఘటన.
గతంలో ఉన్నారు కానీ..
భూమా, నారా, నందమూరి, కోట్ల, కేఈ, వైఎస్, ధర్మాన ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని కుటుంబాలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులుగానూ ఉన్నాయి. కానీ ఒకే మంత్రివర్గంలో మంత్రులుగా అన్నదమ్ముళ్ళు ఉండటం మాత్రం చాలా అరుదు. ఒకవేళ ఉన్నప్పటికీ చాలా తక్కువే. వైఎస్ జగన్ హయాంలో ధర్మాన బ్రదర్స్ ఇద్దరూ మంత్రులుగా పని చేశారు కానీ ఒక్కొక్కరు ఒక్కో టెర్ములో ఉన్నారు. బహుశా బ్రదర్స్ ఇద్దరూ మంత్రులుగా అందులోనూ సినిమా ఇండస్ట్రీ నుంచి వారు ఇప్పటి వరకూ లేరు. ఇప్పుడు ఇది మెగా బ్రదర్స్ పవన్ కళ్యాణ్.. నాగబాబులకే సాధ్యం అయ్యింది. ఒక్కమాటలో చెప్పాలంటే నిజ జీవితంలో మల్టీ స్టారర్ అన్న మాట.
ఉన్న ముగ్గురూ..!
మెగా ఫ్యామిలీలో ముగ్గురు అన్నదమ్ముళ్ళు ఉండగా ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాక రాజ్యసభ పదవితో పాటు కేంద్ర మంత్రిగా మెగాస్టార్ చిరంజీవి బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు తిరుపతి నుంచి చిరు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరవాత కొన్నేళ్ల పాటు ఈ కుటుంబంలో ఎలాంటి పదవి లేదు. పవన్ రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోగా, ఎంపీగా పోటీ చేసిన నాగబాబు ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. 2024 ఎన్నికల్లో గెలిచిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంతో పాటు పలు కీలక స్కాహాలకు మంత్రిగా ఉంటున్నారు. ఇప్పుడిక త్వరలోనే నాగబాబు కూడా మంత్రి కాబోతున్నారు. అన్నదమ్ములు ఇద్దరూ మంత్రిగా ఉండటం విశేషం.. అందులోనూ ఒకే మంత్రివర్గంలోనే కావడం నిజంగా మునుపెన్నడూ ఇలాంటి ఘటనలు లేనేలేవని చెప్పుకోవచ్చు.
ఆదిరిపోలా..!
మెగా ఫ్యామిలీలో ఈ లెక్కన ముగ్గురు బ్రదర్స్ మంత్రులు అయ్యారు. కేంద్రమంత్రిగా చిరు, ప్రస్తుతం ఇద్దరూ మంత్రులు కావడం మెగా కుటుంబానికే సాధ్యమైంది. ఇది నిజంగా చాలా అరుదైన ఘటన అని చెప్పుకోవచ్చు. మెగాభిమానులు, జనసేన కార్యకర్తలకు ఇది మంచి కిక్కించే వార్తే అని అనుకోవచ్చు. నాడు చిరు తనకున్న పర్యాటక శాఖతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. శాఖకు మంత్రిగా అన్ని విధాలుగా న్యాయం చేసారు మెగాస్టార్. ఇప్పుడు పవన్ కూడా దిగ్విజయంగా పాలనసాగిస్తూ, పంచాయితీ రాజ్ శాఖను పరుగులు పెట్టిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇక నాగబాబు తనకు ఇచ్చిన పదవికి ఏ మాత్రం న్యాయం చేయగలరు..? అసలు ఎలాంటి శాఖ ఇస్తారు అన్నది చూడాలి మరి.