అవును.. నిజ జీవితంలో జరిగే కొన్ని కొన్ని సంఘటనలు సినిమాను మించి తలపిస్తాయి. ఇదిగో ఒక తండ్రి ఇచ్చిన తీర్పు ఎలా ఉందో చూసి మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియచేయండి. తల్లితండ్రులు ఇద్దరూ సొంతూరు వదిలి బతుకుదెరువు కోసం కువైట్ వెళ్ళారు. ఐతే ఇంటి దగ్గర ఉన్న కుమార్తెతో వరుసకు తాత అయ్యే వ్యక్తి ఇబ్బంది పెట్టాడు. ఒకసారి కాదు రెండు మూడు సార్లు మందలించినా, పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా ఆగడాలు ఆగలేదు. దీంతో కువైట్ నుంచి వచ్చిన తండ్రి విసుగు చెంది.. తన కుమార్తెను వేధించిన వ్యక్తిని హత్య చేసి, మళ్ళీ కువైట్ వెళ్ళిపోయాడు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే తానే ఇదంతా చేశానని, వీడియో ద్వారా సోషల్ మీడియాలో తెలియజేయడమే.
అసలేం జరిగింది..?
అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొత్తమంగంపేటలో దివ్యాంగుడైన గుట్ట ఆంజనేయులు (59) దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కొత్త మంగంపేటకు చెందిన చంద్రకళ, ఆమె భర్త ఆంజనేయప్రసాద్ కువైట్ లో ఉంటున్నారు. దీంతో తమ కుమార్తె(12)ను ఊళ్లో ఉంటున్న చెల్లెలు లక్ష్మి, వెంకటరమణ దంపతుల వద్ద ఉంచారు. ఇటీవల వెంకటరమణ తండ్రి ఆంజనేయులు మనవరాలి వరసయ్యే ఆ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.
ఫిర్యాదు చేసినా..
ఈ విషయాన్ని బాలిక తన తల్లి చంద్రకళకు ఫోన్ చేసి తెలిపింది. ఆమె వెంటనే చెల్లెలు లక్ష్మికి ఫోన్ చేసి అడగ్గా, ఆమె సరిగా స్పందించలేదు. ఆందోళనతో చంద్రకళ కువైట్ నుంచి వచ్చి ఓబులవారిపల్లె పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడు ఆంజనేయులును పిలిపించి మందలించి వదిలేశారు. ఆమె ఈ విషయాన్ని భర్త ఆంజనేయ ప్రసాద్‌కు చెప్పింది. తీవ్ర ఆవేదనకు గురైన అతడు ఆడపిల్లపై అసభ్యకరంగా ప్రవర్తించినా పోలీసులు పట్టించుకోకపోవడం ఏంటి? అని ఆవేదనకు లోనయ్యాడు. కువైట్ నుంచి వచ్చి శనివారం ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న ఆంజనేయులు తలపై ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేసి ఆ వెంటనే కువైట్ వెళ్లిపోయాడు.
ఇలా వెలుగులోకి..
అనంతరం ఈ విషయాన్ని వివరిస్తూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్టు చేశాడు. ఆడ బిడ్డ తండ్రిగా తాను చేసింది న్యాయమేనని, పోలీసులకు లొంగిపోతానని తీవ్ర ఆవేదనతో బుధవారం నాడు వీడియో రూపంలో వెల్లడించాడు. దీనిపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. పోలీసులు సరిగ్గా ఉంటే ఇదంతా జరిగేది కాదు కదా అని కొందరు అంటుంటే.. చట్టాలు చేతిలోకి తీసుకోవడం తప్పు కదా అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. చట్ట ప్రకారం అతను చేసింది తప్పే కానీ, మోరల్ విషయానికి వస్తే చేసింది కరెక్ట్ అని మరికొందరు చెబుతున్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు ఇలాంటి సంఘటనలు ఎక్కువ అవుతున్నాయని, పోలీసులు సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం వల్ల తన అక్క, చెల్లి ఇద్దరూ విషం తాగి చనిపోయారని ఒక నెటిజన్ వెల్లడించాడు. ఇప్పుడు చెప్పండి ఇది ఎంత వరకూ కరెక్ట్..? ఇందులో తప్పు ఎవరిది..? తండ్రి తీర్పుపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి.