ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాక అభిమానులు, సినీ ప్రియులలో టెన్షన్ పెరిగిపోతోంది. బన్నీ విషయంలో ఏం జరుగుతుందో అని జనాలు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిన్నటి వరకూ మంచు మోహన్ బాబు ఫ్యామిలీ రచ్చ కాగా.. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం గురించే ఎక్కడ చూసినా చర్చించుకుంటున్న పరిస్థితి. మరోవైపు అరెస్ట్ తర్వావాత గాంధీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నాంపల్లి కోర్టుకు హీరోను తరలిస్తున్నారు. ఆస్పత్రి, ఆయా రూట్లలో ఎలాంటి ట్రాఫిక్, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు.
ఉత్కంఠ..
ఇదిలా ఉంటే అల్లు అర్జున్ విషయంలో నాంపల్లి ట్రయల్ కోర్టు తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు క్వాష్ చేయాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ సాయంత్రం 4 గంటలకు కోర్టు విచారణ చేయనుంది. సాయంత్రమే అరెస్ట్ చేసిన విధానంపై కూడా వాదనలు వింటామని న్యాయస్థానం స్పష్టం చేసింది. కోర్టు నుంచి తీర్పు వచ్చే అయితే ఈలోపే పోలీసులు ఆయన్ను ట్రయల్ కోర్టుకు తీసుకెళ్లనున్నారు. దీంతో ఈ న్యాయమూర్తి హైకోర్టు తీర్పు కోసం వేచి చూస్తారా? లేక రిమాండ్ విధిస్తారా? మరేదైనా నిర్ణయం తీసుకుంటారా? అనే దానిపై అభిమానుల్లో టెన్షన్ పెరిగిపోతోంది.
రంగంలోకి మేన మామలు..!
చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌కు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బన్నీకి మద్దతుగా నిలిచారు. మరోవైపు మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు ఇంటికి వెళ్లి అసలేం జరిగింది? అరెస్ట్ చేసిన తీరుపై ఆరా తీశారు. అనంతరం అక్కడినుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లేదా నాంపల్లి కోర్టు దగ్గరికి వెళ్ళే ప్రయత్నాలు చిరు చేస్తున్నారు. తనకున్న పరిచయాలు, ప్రభుత్వంతో ఉన్న సత్సంబంధాలతో గట్టిగానే పిల్లనిచ్చిన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
అరెస్ట్ తప్పు..
బన్నీని అరెస్టు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల తీరును బీఆర్ఎస్, బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. పోలీసుల చేతకాని తనం కారణంగానే హైదరబాద్ సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరిగిందని, తన వైఫల్యం నుంచీ ప్రజల దృష్టి మళ్లించడానికే అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం సీఎం రేవంత్ రెడ్డి నడిపిస్తున్నారని తెలంగాణా బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. మరోవైపు వినాశకాలే విపరీత బుద్ధి అంటూ గులాబి పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.