బన్నీ తర్వాత మోహన్ బాబు వంతు.. పోలీసుల వేట!
టాలీవుడ్ సీనియర్ హీరో మంచు మోహన్ బాబు కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. మొత్తం ఐదు బృందాలుగా ఏర్పడిన పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. ఐతే ఎక్కడా మోహన్ బాబు ఆచూకీ దొరకలేదు. దీంతో ఆయన పరారీలో పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చారు. ఫోన్ సిగ్నల్ కలవకపోవడం, ఇంట్లో లేకపోవడంతో ఎక్కడికి వెళ్లారు..? అనేది పోలీసులకు అంతు చిక్కడం లేదు. ఈ క్రమంలోనే బృందాలుగా విడిపోయిన పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.
అరెస్ట్ చేస్తారా..?
వాస్తవానికి ఇవాళ ఉదయమే మోహన్ బాబును అరెస్ట్ చేస్తారని పెద్ద ఎత్తునే వార్తలు వచ్చాయి. ఐతే ఎందుకు పోలీసులు విరమించుకున్నారు అనేది తెలియట్లేదు. అల్లు అర్జున్ అరెస్టుతో ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి వచ్చింది. ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేయరు..? అని ప్రశ్నలు రావడమే కాదు ఒకింత ప్రభుత్వాన్ని తిట్టిపోశారు కూడా. దీంతో వెంటనే మోహన్ బాబును అరెస్ట్ చేయాలని ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు వచ్చాయని తెలిసింది. దీంతో మధ్యాహ్నం నుంచి మోహన్ బాబు అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం? చేశారనే వార్తలు గుప్పుమంటున్నాయి.
ఎందుకు అరెస్ట్..?
మంచు ఫ్యామిలీ వివాదంలో న్యూస్ కవరేజికి వెళ్లిన రంజిత్ అనే టీవీ9 జర్నలిస్టు మైక్ లాక్కొని అతనిపైనే దాడి చేసిన ఘటన సంచలనమే అయ్యింది. ఎందుకు ఇలా జరిగిందనే దానిపై వివరణ ఇచ్చుకున్నా జర్నలిస్టు సంఘాలు, నేతలు అస్సలు తగ్గలేదు. మరోవైపు రంజిత్ ప్లాస్టిక్ సర్జరీ తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఈ క్రమంలో జర్నలిస్టుపై దాడి చేసి రెండు రోజులు అవుతున్నా ఇంకా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఇక్కడ కూడా చట్టం తన పని తాను చేసుకుంటూ పోవాలి కదా? అని జర్నలిస్టులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే ముందస్తు బెయిల్‌ను కూడా హైకోర్టు తిరస్కరించడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఏ క్షణమైనా మోహన్ బాబును అరెస్ట్ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.