బన్నీ చిన్నప్పటి నుంచీ తెలుసు.. వదిలేయాలా!?
హీరో అల్లు అర్జున్ నాకు చిన్నప్పటి నుంచీ తెలుసు.. అందుకని అరెస్ట్ చేయకుండా వదిలేయాలా..? ఏంటి అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. శుక్రవారం జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అంతే కాదు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని ఎవరైనా సరే చట్టవిరుద్దంగా నిరసన తెలిపితే వాళ్ళను కూడా అరెస్ట్ చేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో బన్నీ అరెస్ట్ వ్యవహారం, దేశంలో ఇప్పటి వరకూ జరిగిన సెలెబ్రిటీల అరెస్టులపై కూడా ప్రస్తావన చేశారు. ఇదే క్రమంలో తాను ఎవరికి అభిమాని అనే విషయాలను కూడా ఆయన పంచుకున్నారు.
ఏం చేద్దాం మీరే చెప్పండి!
భారతదేశంలో సల్మాన్ ఖాన్ సంజయ్ దత్ లాంటి వ్యక్తులు ఎందుకు అరెస్ట్ అయ్యారు..? దేశంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఉంది దానికి అనుగుణంగానే చట్టం పనిచేస్తుంది. ఫిలిం స్టార్లు, పొలిటికల్ స్టార్ల కోసం ప్రత్యేకంగా ఏముండదు కదా. అక్కడ మహిళ ప్రాణం పోయింది..ఓ బాబు చావు బతుకుల్లో ఉన్నాడు దీనికి ఎవరు బాధ్యులు..? దీనిపై మేం కేసు పెట్టకపోతే.. ఎందుకు పెట్టలేదని మిమ్మల్ని అడగరా? అల్లు అర్జున్ సినిమా చూడటానికి వచ్చి సినిమా చూసి వెళ్ళిపొకుండా కారులో నుంచి బయటికి చూస్తూ హంగామా చేశాడు. నీ సినిమా నువ్వు స్టూడియోలో స్పెషల్ షో వేసుకొని చూడొచ్చు కదా..? కావాలంటే ఇంట్లో హోమ్ థియేటర్ వేసుకుని చూడొచ్చు కదా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
నేనే స్టార్..
నాకు చిన్నప్పటినుంచి అల్లు అర్జున్ తెలుసు, అతనికి నేను తెలుసు. అలా అని వదిలేయాలా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అల్లు అర్జున్ ఏమైనా ఇండియా పాకిస్తాన్ బార్డరులో యుద్ధం చేశాడా..? సినిమాలో డబ్బులు పెట్టాడు సంపాదించుకున్నాడు. వాళ్లు ప్రత్యేకంగా దేశం కోసం చేసింది ఏం లేదు కదా..? నా ఫేవరెట్ హీరో కృష్ణ.. ఆయన ఇప్పుడు లేరు. ఇప్పుడు నేనే స్టార్.. నాకే ఫాన్స్ ఉంటారు, ఉండాలి కూడా అని ఒకింత గర్వంగానే రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చారు.
రేవంత్ ఫ్లాప్..!
ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్టుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రముఖ జర్నలిస్టు అర్ణబ్ గోస్వామి డిబెట్ వేదికగా మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఫ్లాప్ యాక్టర్, ఐతే అల్లు అర్జున్ మాత్రం సూపర్ సూపర్ స్టార్ అయ్యారని కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి.. అల్లు అర్జున్ను వీకెండ్ అరెస్ట్ చేసి సోమవారం వరకు జైల్లో పెట్టాలి అనుకున్నరని కూడా అర్ణబ్ గోస్వామి వ్యాఖ్యానించడం గమనార్హం.