అవును.. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టుతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై ఘోరాతి ఘోరంగా కామెంట్స్, అంతకు మించి ట్రోలింగ్ నడుస్తోంది. ఇందుకు కారణం ఒకటి కాదు రెండు. దొరికిందే సందు కదా అని వైసీపీ కార్యకర్తలు, నేతలు.. టీడీపీ కూటమి వ్యతిరేకులు, విమర్శకులు చంద్రబాబును గట్టిగానే తిట్టిపోస్తున్న పరిస్థితి ఆంధ్రాలో, సోషల్ మీడియాలో నెలకొంది. ఇంతకీ ఎందుకు ఇంతలా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ట్రోల్ చేస్తున్నారు..? ఐనా ఈ సందర్భంలోనే ఎందుకు ఇలా చంద్రబాబు పేరు తెరపైకి వచ్చింది అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి మరి.
ఇదీ అసలు కథ..
గోదావరి పుష్కరాల్లో భద్రత లోపం వల్ల, ఒక కుటుంబం ప్రచార యావ వల్ల 30 మంది చనిపోయిన ఘటనకు బాధ్యులు నాటి, నేటి సీఎం చంద్రబాబు ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు..? ఆయనపై న్యాయస్థానం కఠిన చర్యలు కనీసం తీసుకోలేదేం? అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్న రచ్చ. అంతే కాదు.. కందుకూరులో చంద్రబాబు ఇరుకు సందులో సభ నిర్వహిస్తే అప్పుడు మరణించిన వారి సంఖ్య 9 ఐతే చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారా? ఈ రెండు ఘటనలలో ప్లానింగ్ లేదు, పోలీసులు వద్దన్నా జనాన్ని ఒక వైపు పంపారన్నది అతి పెద్ద ఆరోపణ. తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన ఈ రెండు సంఘటనలలో చంద్రబాబుపై ఎందుకు యాక్షన్ తీసుకోలేదన్నది ఇప్పుడు సంధ్య థియేటర్ ఘటన, బన్నీ అరెస్టును ప్రస్తావిస్తూ వైసీపీ కార్యకర్తలు, విమర్శకులు, నెటిజన్లు పోస్తున్నారు.
ఇదేం న్యాయం..?
రాజకీయ నాయకులకు ఒక న్యాయం.. సినీ నటులు, సామాన్య ప్రజలకు ఒక న్యాయమా? ఎందుకు ఇలా ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం? అంటూ సామాన్య జనాలు మొదలుకుని సెలెబ్రిటీల వరకూ పెద్ద ఎత్తున ప్రభుత్వాలు, పోలీసులు, న్యాయస్థానాలను ప్రశ్నిస్తూ ఉన్నారు. అంతేకాదు.. రైతుల కోసం వైసీపీ నేతలు చేస్తున్న పోరుబాట రోజునే అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక ఆంతర్యం ఏమిటి? మీడియాలో వార్తల డైవర్సన్ కూడా ఆలోచన చేశారా? అరెస్ట్ ధర్మం కోణంలో ఆలోచిస్తే, 2015 గోదావరి పుష్కారాలలో 30 మంది మరణించారు, మరి ఆ సందర్భముగా ఎన్ని అరెస్టులు జరిగాయి? ఎవరెవరికి ఏ ఏ శిక్షలు పడ్డాయి? అని వైసీపీ కార్యకర్తలు అవకాశం దొరికిందని గట్టిగానే చంద్రబాబును ట్రోల్ చేస్తున్న పరిస్థితి. అసలే సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న వారిని తాట తీసి వదులుతున్న ఈ క్రమంలో ఇప్పుడు మళ్ళీ ఇలా హడావుడి చేస్తున్న నెటిజన్లు, వైసీపీ కార్యకర్తలపై ఎలాంటి చర్యలు ఉంటాయో ఏంటో చూడాలి మరి.