తెలుగు రాష్ట్రాలు, టాలీవుడ్ ఇండస్ట్రీలో నిన్న ఉదయం నుంచి ఇవాళ ఉదయం ఒక్కరోజు పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ గురించే చర్చ నడిచింది. మధ్యంతర బెయిల్ రావడంతో రాత్రి రిలీజ్ కావాల్సిన బన్నీ కొన్ని అనివార్య కారణాల వలన శనివారం విడుదల అయ్యాడు. రిలీజ్ తరవాత నేరుగా గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వెళ్ళడం తన లీగల్ టీమ్ సభ్యలతో మాట్లాడిన తరవాత అటు నుంచి తన నివాసానికి చేరుకున్నాడు. దీంతో అక్కడ అంతా భావోద్వేగ వాతావరణం నెలకొంది.
అంతా ఎమోషనల్!
బన్నీ ఇంటికి రాగానే ఆయన్ను చూసి భార్య స్నేహారెడ్డి, పిల్లలు భావోద్వేగానికి గురయ్యారు. స్నేహారెడ్డి భర్తను పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంది. మరోవైపు అభిమానులు, మీడియా తాకిడి ఎక్కువగానే ఉంది. మీడియా మిత్రులతో మాట్లడకపోవచ్చు అని అందరూ అనుకున్నారు కానీ, నిమిషాల వ్యవధిలోనే ముగించాడు. ఇక అరెస్ట్ తీరు, జైలులో ఏం జరిగింది? హైకోర్టు బెయిల్ మంజూరు చేసినా ఆలస్యం రిలీజ్ చేయడం లాంటి విషయాలపై గట్టిగానే మాట్లాడుతారు.. ప్రభుత్వం, పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు, విమర్శలు చేస్తాడని అందరూ భావించారు. కానీ అదేమీ జరగలేదు.
చాలా జాగ్రత్తగా..!
అసలే మీడియాతో సీనియర్ హీరో మంచు మోహన్ బాబు గొడవ, కుటుంబంలో నెలకొన్న వివాదంతో పెద్ద రాద్దాంతమే జరిగింది. దీనికి తోడు కేసు కోర్టు పరిధిలో ఉండటంతో అల్లు అర్జున్ చాలా జాగ్రత్తగా, ఆచి తూచి మాట్లాడాడు. ఎలాంటి కాంట్రవర్సీ విషయాలు మాట్లాడకుండా, ముఖ్యంగా విమర్శలకు తావు లేకుండా, చాలా బాధ్యతగా తాను చెప్పాలనుకున్నది మాత్రమే చెప్పిన అల్లు అర్జున్ మీడియా మీట్ ముగించాడు. ఇక్కడే బన్నీ చాలా తెలివిగా, హుందాగా ప్రవర్తించాడని చెప్పుకోవచ్చు. చెప్పాల్సింది మాత్రమే చెప్పిన బన్నీ మనసులో ఎంత దాచుకున్నాడో అనే కామెంట్స్ కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి.
ఇంతకీ ఏం మాట్లాడాడు..?
నేను బాగున్నా.. నా గురుంచి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. నేను చట్టాన్ని గౌరవిస్తున్నా. కోర్టులో కేసు ఉంది ఇప్పుడేమీ మాట్లాడను. ఇది అనుకోకుండా జరిగిన ఘటన. రేవతి కుటుంబానికి నా సానుభూతి. కేవలం నా సినిమాలకే కాదు. ఇతర సినిమాలు చూసేందుకు కూడా సంధ్య థియేటర్‌కి వెళ్తుంటాను. 30 కంటే ఎక్కువ సార్లు అక్కడికి వెళ్లాను. కానీ ఎప్పుడూ తొక్కిసలాంటి ఘటనలు జరగలేదు. అది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన.. రేవతి కుటుంబానికి నేను అండగా ఉంటానని మాటిస్తున్నా. పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేము గానీ.. వారికి ఎలాంటి సహాయమైనా అందిస్తాను అని అల్లు అర్జున్ మీడియాకు వెల్లడించాడు.