టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎట్టకేలకు ముందస్తు బెయిల్ పైన చంచల్ గూడ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. అరెస్ట్, బెయిల్, రిలీజ్ అనేది సెలబ్రిటీలు, వైట్ కాలర్ వ్యక్తులకు పెద్ద విషయమేమీ కాదనుకోండి. బన్నీ అరెస్ట్ అయ్యింది మొదలుకుని రిలీజ్ అయ్యి ఇంటికి చేరుకునే వరకూ సోషల్ మీడియా, కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థలు అంతకు మించి కొన్ని వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానెల్స్ ఒక్కటే హడావుడి చేస్తున్నాయి. అరెస్ట్ కుట్ర అని కొందరు అంటుంటే ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారు? అనేది అందరికీ తెలుసు అని మరికొందరు చెప్పుకుంటున్న పరిస్థితి. ఇక ఆ పార్టీ, ఈ పార్టీ అని ప్రత్యేకంగా చెప్పడానికి ఏం లేదు కానీ.. ఈ అరెస్టుపై ఇష్టానుసారం కామెంట్స్ చేస్తున్నారు.
రాజకీయాలు ఇలా..!
లోకంలో ఎక్కడేం జరిగినా సోషల్ మీడియాలో రచ్చ మాత్రం ఉండనే ఉంటుంది. అందులోనూ పార్టీలు, అభిమానులు.. కులం, మతం పేర్లు పెట్టి మరీ కొట్టుకుంటున్న పరిస్థితి మనం చాలానే చూసి ఉంటాం. ఎందుకు ఇంత అత్యుత్సాహం అనేది ఇలా చేసే వాళ్లకు ఐనా తెలుస్తుందో లేదో..! రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు అస్సలు ఉండరు. ఇవాళ కొట్టుకున్నా.. తిట్టుకున్నా అంతకు మించి అరెస్ట్ చేపించుకున్నా సరే వాళ్ళది రాజకీయం అనే కులం గనుక, అందులో నిత్యం మునిగితేలుతుంటారు. పార్టీలు, అధికారం, ప్రతిపక్షం అనేది మాత్రమే వేరు కానీ వాళ్ళు అంతా ఒక్కటే. సమయం, సందర్భం వచ్చినప్పుడు ఒక్కటవుతారు అంతే. మధ్యలో కార్యకర్తలు, నేతలు కొట్లాడుకుంటే మిగేలేది ఏముంది.. గొడవలు, కొట్లాటలు, సోషల్ మీడియాలో ఇష్టానుసారం మాటలు,
సినీ ఇండస్ట్రీ విషయంలో..
ఇక సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే ఇదీ అంతే. ఇందులోనూ ఎవరూ బద్ద శత్రువులు, అంతకు మించి మిత్రులు ఉండరు. గొడవలు, కొట్లాటలు కామన్. ఇందులో ఆ ఫ్యామిలీ.. ఈ ఫ్యామిలీ అని ఏమీ లేదు అంతా ఒక్కటే. చిన్న చిన్న మనస్పర్థలు, నటుల మధ్య పోటీ ఉండొచ్చు గాక అంత మాత్రాన వాళ్ళంతా కళామతల్లి బిడ్డలే అన్న విషయం మరిచిపోయి ప్రవర్తిస్తే ఒరిగేది ఏమీ లేదన్న విషయాన్ని తెలుసుకుంటే మంచిది. ఇదిగో నా హీరో ఇలాంటివి చేయడు.. అరెస్ట్ దాకా వెళ్ళడు అని కొందరు అంటుంటే.. తగిన శాస్తి జరిగింది అని మరికొందరు చెప్పుకుంటూ శునకానందం పొందుతూ ఉండటం గమనార్హం. దీన్ని ఖండిస్తూ అల్లు అర్జున్ ఆర్మీ, వీరాభిమానులు కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. నిన్న ఉదయం నుంచి ఇదంతా నాన్ స్టాప్ గానే నడుస్తూనే ఉంది. చూశారుగా ఎవడి గోల వాడిదే. ఒక్కసారి ఆలోచించుకోండి ఈ గొడవ, రాద్దాంతం చేయడం వల్ల నయాపైసా ప్రయోజనం ఏమైనా ఉందా..!