అవును.. మీరు వింటున్నది.. చూస్తున్నది అక్షరాలా నిజమే. ఉదయం టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ మొదలుకుని బెయిల్ వచ్చేంత వరకూ చోటు చేసుకున్న పరిణామాలు కాస్త నిశితంగా గమనిస్తే అసలు విషయం మీకే అర్థం అవుతుంది. ఇది ఒకింత మెగాభిమానులు, అల్లు అర్జున్ ఆర్మీకి కాస్త ఉపశమనం కలిగించే విషయమే అయినా కొందరిలో మాత్రం అసంతృప్తి అలాగే ఉంది. దీనికితోడు మరికొందరిలో భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి.
ఇదీ అసలు సంగతి..
మెగా ఫ్యామిలీని ఏకం చేసిన ఘనత వందకు వెయ్యి శాతం సీఎం రేవంత్ రెడ్డిదే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇంకా చెప్పాలంటే తెలంగాణ ప్రభుత్వానిదే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బన్నీ తన ఆప్తమిత్రుడు శిల్పా రవి నంద్యాల నుంచి పోటీ చేసిన సందర్భంలో ఆయన ఇంటికి వెళ్లి మద్దతు ఇచ్చాడు. ఇక్కడ మొదలైన వివాదం, పుష్ప 2 సినిమాతో మరింత పెరిగిపోయింది. ఇంకా చెప్పాలంటే మెగా - అల్లు కుటుంబాల మధ్య పచ్చ గడ్డేస్తే భగ్గుమనేలా పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అటు కుటుంబ సభ్యులు.. ఇటు అభిమానుల మధ్య తీవ్ర వాతావరణమే నెలకొంది. సరిగ్గా ఈ క్రమంలో వెయ్యి కోట్లు కలెక్షన్లు దాటడంతో ఎక్కడ చూసినా అల్లు అర్జున్ గురుంచే చెప్పుకుంటున్న పరిస్థితి.
ఒక్క అరెస్ట్.. కలిపింది!
సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన విషయాల్లో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తీరు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఇవన్నీ అభిమానులు, ఆఖరికి మెగా కుటుంబ సభ్యులను కూడా కలచివేసాయి. దీంతో మెగా బ్రదర్స్ అంతా రంగంలోకి దిగిపోయారు. అల్లు ఇంటికి మెగా బ్రదర్స్ తొలుత మెగాస్టార్ చిరంజీవి, ఆ తర్వాత కాబోయే మంత్రి నాగబాబు రావడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది. పోలీస్ స్టేషన్ లేదా గాంధీ ఆస్పత్రికి వెళ్లాలని చిరు భావించినా అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుందని దీంతో ఆయన విరమించుకున్నారు. మూడు గంటల పాటు అల్లు అర్జున్ ఇంట్లోనే ఉన్న బ్రదర్స్ ఇద్దరూ అల్లు అర్జున్ కుటుంబానికి దైర్యం చెబుతూ.. జరుగుతున్న పరిణామాలపై ఆరా తీస్తూ వచ్చారు. బన్నీకి బెయిల్ రాకతో కథ సుఖాంతం అయ్యింది. అప్పుడే చిరు, నాగబాబు ఇద్దరూ అల్లు అర్జున్ ఇంటి నుంచి బయటికి వచ్చారు.
ఇదే పెద్ద ట్విస్ట్..
ఇవన్నీ ఒక ఎత్తయితే.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ రావడం గమనార్హం. మొన్నటి వరకూ కొట్లాటలు, గొడవలు అంతకు వైరం అన్నట్టుగా ఉన్న సీన్ మొత్తం ఒక్క అరెస్టుతో అంతా సెట్ అయ్యింది. అంటే మెగా బ్రదర్స్ ముగ్గురూ అల్లు ఫ్యామిలీతో ఒక్కటయ్యారన్న మాట. అందుకే అరెస్ట్ కలిపింది అందరినీ అని చెప్పేది. ఇక ఇండస్ట్రీ అల్లు అర్జున్ కోసం ఇటు పోలీస్ స్టేషనుకు, అటు కోర్టుకు సినీ సెలబ్రిటీలు తాకిడి ఎక్కువ అయ్యింది. ఐతే ప్రముఖ నటులు ఎవ్వరూ పెద్దగా మనకెందుకు? అని పట్టించుకోకుండా సైలెంతవ్వడం గమనార్హం. ఇక బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు దేశవ్యాప్తంగా బన్నీకి గట్టిగానే మద్దతు లభించింది.
ఏ ముఖం పెట్టుకుంటారో..?
కాగా.. మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా పరిస్థితులు ఉన్నాయని తెగ క్యాష్ చేసుకున్న వైసీపీ అండ్ కో ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుంటుంది..? వాళ్ళు అంతా ఒక్కటయ్యారు. అరెస్ట్ అందరినీ ఒక్కటి చేసింది.. ఇప్పుడు మధ్యలో బకరా అయ్యింది ఎవరు..? వైసీపీనా..? కాదా..? మరీ ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ స్థాయి తగ్గించడానికి వైసీపీ పడిన కష్టం అంతా పూర్తిగా వృథా అయిన పరిస్థితిని మనం కళ్ళారానే చూస్తున్నాం. చూశారుగా ఒక్క అరెస్ట్.. ఒకే ఒక్క రోజులో ఎంత వేగంగా పరిణామాలు మారిపోయాయో..! ఎక్కడా శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరన్న విషయం తెలుసుకుంటే మంచిది సుమీ. అంతే కాదు.. ఇద్దరి మధ్య దూరి అనవసరం ఆగమాగం అవ్వడం కూడా అంటే ఏంటో కూడా చూశారు కదా.. ఇంకా డైరెక్టర్ కొరటాల శివ మాటల్లో చెప్పాలంటే.. ఎవరి పని వాళ్ళు చూసుకుంటే సమాజానికి మంచిది. ఇది సినీ ఇండస్ట్రీ, రాజకీయ రంగానికి ముఖ్యంగా మెగా.. అల్లు కుటుంబాలకు కూడా వర్తిస్తుంది మరి.