తెరపైకి కొత్త పంచాయతీ.. బన్నీపై ఏమిటీ మాటలు!
మీడియా, యూట్యూబ్, సోషల్ మీడియా, వెబ్ సైట్లలో ఎవడికి తోచినట్టు వాళ్ళు రాసుకోవడం, మాట్లాడటం పరిపాటి అయిపోయింది. నోరు ఉంది కదా అని ఎవడిగోల వాడిది అన్నట్టుగా ప్రవర్తించడం ఈ మధ్య మామూలు అయిపోయింది. వ్యూస్ కోసం, పాపులారిటీ, వైరల్ కావడానికి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కొందరు పనిగా పెట్టుకున్నారు. దీనికి మీడియా అనే ముసుగు వేసుకోవడం గమనార్హం. ఇక అసలు విషయానికొస్తే జర్నలిస్టు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఏమిటీ కొత్త పంచాయతీ, ఎందుకిలా మాట్లాడుతున్నాడు అంటూ అందరూ చర్చించుకుంటున్న పరిస్థితి.
ఇంతకీ ఏమన్నాడు..?
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నాకు ఒక్కడికే జాతీయ అవార్డు ఉండాలని అల్లు అర్జున్ కుట్ర పన్నిన విషయం నిజం కాదా? జానీ మాస్టర్ జైలుకు వెళ్లడంలో కూడా బన్నీ కుట్ర ఉందా.. లేదా..? జానీ మాస్టర్ బెయిల్ పైన బయటికి వచ్చాక కూడా నేషనల్ అవార్డు వెనక్కి తీసుకోవాలని లేఖ రాసింది వీళ్ళు కాదా..? మరి ఈ కేసులో అల్లు అర్జున్ ముద్దాయి కాబట్టి నేషనల్ అవార్డు వెనక్కి ఇస్తాడా..? అల్లు అర్జున్ ఒక ఎర్ర చందనం దొంగ. ఆ దొంగకు నేషనల్ అవార్డు వచ్చిందని నేను చాలా బాధ పడ్దాను. కాలం సమాధానం చెబుతుంది… నువ్వు కూడా ఇప్పుడు జైలులో ఉన్నావ్ కదా? అంటూ మల్లన్న వ్యాఖ్యానించారు. ఇప్పుడీ కామెంట్స్ కొత్త చర్చకు దారితీశాయి.
వ్యక్తిగతమా.. పార్టీ పరంగానా..?
ఇప్పటి వరకూ ఈ కోణంలో ఎవరూ మాట్లాడింది లేదు. వాస్తవానికి అప్పట్లో జానీ మాస్టర్ అరెస్ట్, జైలుకు వెళ్లిన తర్వాత ఎన్నెన్నో రూమర్స్ అంతకు మించి అల్లు ఫ్యామిలీపై ఆరోపణలు వచ్చాయి కానీ నేరుగా ఎవరూ మాట్లాడింది లేదు. సోషల్ మీడియాలో ఇప్పుడీ కామెంట్స్ తెగ వైరల్ అయ్యి.. చర్చ నడుస్తున్న పరిస్థితి. ఇవన్నీ ఒక ఎత్తయితే ఈ మాటలు ఒక జర్నలిస్టుగా అన్నాడా..? లేదా కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకుని ఎమ్మెల్సీగా పార్టీ తరపున అన్నాడా..? అన్నది తెలియాల్సి ఉంది. పార్టీ స్టాండ్ ఇదే ఐతే పరిస్థితి ఇంకాస్త సీరియస్ అయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఈ కామెంట్స్ ఇంకాస్త అగ్గికి ఆజ్యం పోసినట్టు అయ్యాయి.. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి మరి.