వైసీపీ సీనియర్ నేత, మాజీ మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులకు ఉచ్చు బిగుస్తోంది. రేషన్ బియ్యం గోదాముల్లో అవకతవకలపై ఏ క్షణమైనా పేర్ని సతీమణి జయసుధను అరెస్ట్ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కనిపించకుండా పోయిన ఫ్యామిలీ.. మచిలీపట్నం జిల్లా, హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. ఈ నెల 19కి విచారణ వాయిదా పడింది. ఈ క్రమంలోనే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది. దీంతో అజ్ఞాతం వీడి బయటికి వచ్చిన ఫ్యామిలీకి మరో షాక్ ఇచ్చారు పోలీసులు. మంగళవారం నాడు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దీంతో వాళ్ళు రాష్ట్రం, దేశం విడిచి వెళ్ళడానికి లేదు.
ఇంతకీ ఏం జరిగింది..?
పేర్ని నాని సతీమణి జయసుధ పేరిట మచిలీపట్నంలో కొన్ని గోదాములు ఉన్నాయి. వీటిని ప్రభుత్వ పౌరసరఫరాల శాఖకు లీజు ప్రాతిపదికన అప్పగించడం జరిగింది. వైసీపీ హయాంలో నుంచి ఇప్పటి వరకూ పౌరసంబంధాల శాఖ ద్వారా పంపిణీ చేసే బియ్యాన్ని ఈ గోదాముల్లో ప్రభుత్వం నిల్వ చేస్తోంది. భారీ స్థాయిలో నిల్వ ఉండే బస్తాలలో ఇటీవల తనిఖీలు నిర్వహించగా భారీగా అవకతవకలు బయటపడ్డాయి. ప్రభుత్వం నిల్వ ఉంచిన బియ్యంలో ఏకంగా 3,708 బస్తాల రేషన్ బియ్యం మాయం కావడం రాష్ట్రంలో పెద్ద సంచలనమే అయ్యింది. సివిల్ సప్లై అధికారుల ఫిర్యాదు మేరకు మచిలీపట్నం తాలూకా పోలీసులు నాని భార్య జయసుధతో పాటు, మేనేజర్ మానస్ తేజపై అధికారులు కేసు నమోదు చేశారు. అరెస్ట్ తప్పదని బావించిన పేర్నీ నాని కుటుంబంతో సహా అజ్ఞాతంలోకి వెళ్ళింది.
ఎప్పుడు బయటికి వచ్చేది..?
ఎందుకంటే అసలే రేషన్ అక్రమాలపై సీరియస్ గా ఉన్న సర్కార్.. ఇక్కడ బియ్యం మాయం అయ్యాయని తేలడం, పైగా ప్రభుత్వంపై కూడా నానీ ఇష్టానుసారం మాట్లాడం ఈ విషయాలన్నింటిపైన ఆగ్రహంగా ఉన్న సర్కార్ అవకాశం దొరికింది కదా అని పోలీసులు రంగప్రవేశం చేశారు. దీంతో చేసేదేమీ జిల్లా కోర్టు, హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు తీర్పు ఒకింత అనుకూలంగా రావడంతో బయటికి వచ్చిన నాని ఫ్యామిలీ.. మచిలీపట్నంలో తన నివాసంలో ప్రత్యక్షమైంది. అంతేకాదు ఆయన్ను వైసీపీ కీలక నేతలు, అనుచరులు, కార్యకర్తలు కలిసి మద్దతు ఇచ్చారు కూడా.