ఎట్టకేలకు టీడీపీలోకి ఆళ్ళ నాని.. ముహూర్తం ఫిక్స్
అవును.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని పసుపు కండువా కప్పుకోబోతున్నారు. బుధవారం నాడు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. గతంలో ఒకసారి నాని టీడీపీ చేరిక వాయిదా పడినప్పటికీ ఇప్పుడు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఆళ్ల రాకపై ఏలూరు టీడీపీ కార్యకర్తలు, నేతలు ఆఖరికి ఎమ్మెల్యే కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో చేరిక వాయిదా పడింది.
గ్రీన్ సిగ్నల్..
ఈ క్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటితో సీఎం చంద్రబాబు వ్యక్తిగతంగా మాట్లాడారు. ఎలాంటి ఇబ్బందులూ ఉండవని, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలని సీఎం సూచించారు. నానితో ఎలాంటి ఇబ్బందులూ ఉండవని చెప్పడంతో ఏలూరులో అసంతృప్తిగా ఉన్న తెలుగు తమ్ముళ్లు అంతా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. దీంతో ఆళ్ళ చేరికకు మార్గం సులువు అయ్యింది. ఐనా చంద్రబాబు చెబితే కాదనే పరిస్థితి ఉంటుందా..!
అంతకు ముందు ఇలా..!
నాని చేరిక నేపథ్యంలో ఎమ్మెల్యే బడేటి చంటి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆళ్ల నాని రాకను తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని.. కార్యకర్తలు అభిప్రాయాలను అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. వైసీపీ హయాంలో ఏలూరు కార్యకర్తలు చాలా నష్టపోయారని, అధిష్టానం ఆ విషయాన్ని గుర్తించాలనీ చెప్పారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నుంచి ఫోన్ కాల్ రావడంతో అంతా ప్రశాంతం అయ్యింది. ఇప్పటివరకు వద్దంటే వద్దన్న నేతలు హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం అని చెప్పిన పరిస్థితి.
కలిసి మెలిసి..!
ఆళ్ల నాని చేరిపై కార్యకర్తలు అయిష్టంగా ఉన్నా, అధిష్ఠానం సూచన మేరకు ఒప్పుకున్నా అని ఎమ్మెల్యే వెల్లడించారు. అందరూ కలిసిమెలిసి పనిచేయాలని అధిష్ఠానం చెప్పిందన్నారు. పార్టీ నిర్ణయమే మాకు శిరోధార్యం అని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకూ ఓకే కానీ.. నాని చేరితే ఆయనకు ఏం పదవి కట్టబెడతారు..? అసలు పదవి అనేది ఏమైనా ఉంటుందా లేదా అనేది తెలియట్లేదు అని ఆళ్ళ అభిమానులు ఒకింత ఆందోళన చెందుతున్నారు.