ఏపీలో రానున్న ఎన్నికల సమరానికి సేనలను సిద్ధం చేయడానికి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పక్కా ప్లానింగ్ సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల నగారా మోగకముందే ఈనెల 27న విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచే సమరశంఖం పూరించనున్నారు. దీని కోసం భారీగా ఏర్పట్లని మొదలు పెట్టారు. దీనిలో భాగంగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి భారీఎత్తున తరలివెళ్లడానికి పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నారు.
ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి విశాఖ జిల్లాలోని విశాఖపట్టణం–భువనేశ్వర్ జాతీయ రహదారిని ఆనుకొని తగరపువలస మూడు కోవెళ్లు ఎదురుగా ఉన్న విశాలమైన స్థలాన్ని భారీ బహిరంగ సభ కోసం ఎంపిక చేశారు.
జగన్ అధ్యక్షతన జరగబోయే భీమిలి బహిరంగ సభకు ప్రతి నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున పార్టీ శ్రేణులు తరలివెళ్లేందుకు ఇప్పటికే సన్నద్ధతపై ఆయా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సమావేశాలు ఏర్పాటుచేశారు. వాహనాలు ఏవిధంగా సమకూర్చుకునేదీ, ఎవరెవరూ వెళ్లాలనేదీ ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. అన్ని జిల్లాల నుంచి తరలివస్తున్న ప్రజల దృష్ట్యా ట్రాఫిక్ ఇబ్బందుల్లేకుండా ఏవిధంగా, ఏ సమయంలో చేరుకోవాలనేదీ నాయకులకు దిశా నిర్దేశం చేసారు.