రాజకీయాల్లో గెలుపోటములు సర్వసాధారణం.. దేనినైనా సమానంగా తీసుకోగలిగితేనే తప్ప లేదంటే కష్టం. ఎంత తలపండిన నాయకుడైనా ఏదో ఒక సమయంలో ఓటమిని చవిచూడాల్సిందే. అయితే ఓడిపోయాం కదా అని ఇంటికే పరిమితమైతే.. కష్టం కదా. ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత కూడా చేస్తున్నది ఇదే. పార్టీ అధికారాన్ని కోల్పోయాక ఆయన బయటకు రావడం లేదు. చివరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకైనా ఆయన హాజరవుతారనుకున్నారు. బీఆర్ఎస్ నేతలు కూడా ఇదే చెప్పారు. కానీ వాటికి కూడా ఆయన హాజరు కాలేదు. ఈ విషయంలో చివరకు బీఆర్ఎస్ నేతలకు సైతం నిరాశే మిగిలింది.
జీర్ణించుకోలేకపోతున్నారా?
అసలు బీఆర్ఎస్ అధినేత తమ పార్టీ ఓటమిని ఒప్పుకోవట్లేదా? లేదంటే కాంగ్రెస్ సక్సెస్‌ను జీర్ణించుకోలేకపోతున్నారా? లేదంటే చిరకాల ప్రత్యర్థి అయిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారా? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది. నిజానికి ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబును మెచ్చుకుని తీరాల్సిందే. ఇలాంటి కేసీఆర్‌లందరికీ ఆయనొక ఆదర్శమనే చెప్పాలి. టీడీపీ నీడలో ఎదిగిన నాయకులు.. చంద్రబాబుతో పాటు పార్టీని పాతాళానికి తొక్కేస్తామంటూ వేరే పార్టీలోకి వెళ్లి సవాళ్లు విసిరారు.
టీడీపీని తొక్కేసే యత్నం..!
అయినా సరే.. ఆయన తలవంచలేదు. ప్రతిపక్ష నేతగా తన వంతు పాత్ర పోషించారు. తాను ముందుండి తన సైన్యాన్ని నడిపించారు. పార్టీ ఓడిపోయిందని ఇంట్లో కూర్చోలేదు. ఒకప్పుడు కేసీఆర్ సైతం తనకు మంత్రి పదవి రాకపోవడంతోనే చంద్రబాబుతో విభేదించి బయటకు వచ్చారు. ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్‌ను స్థాపించి చంద్రబాబును, టీడీపీని తొక్కేయడానికి యత్నించారు. ఇప్పటికీ చంద్రబాబును తన శత్రువు మాదిరిగానే చూస్తున్నారు. అయినా సరే.. చంద్రబాబు ఎక్కడా తొణకలేదు.. బెణకలేదు. హూందాగానే వ్యవహరించారు. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే అత్యధిక కాలం సీఎంగా పని చేసిన చంద్రబాబు తన పార్టీ అధికారాన్ని కోల్పోయినా ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. గెలుపోటములను సమానంగానే చూశారు.