టీడీపీ తుది జాబితా ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడేలా చేసింది. తుది జాబితాలో అయినా తమ పేరు ఉండకపోతుందా అని ఆశపడిన అభ్యర్థులు.. తుది జాబితాలో తమ పేరు లేకపోవడంతో అసంతృప్తితో రగిలిపోతూ టీడీపీ పార్టీ అభ్యర్థిత్వానికి రాజీనామా చేస్తున్నారు. తమ నేతలకి టికెట్ రాకపోవడంతో కార్యకర్తలు కూడా రెచ్చిపోయి రగడ మొదలు పెట్టారు.
అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గంలోనూ టీడీపీ నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. చంద్రబాబు రూ.150 కోట్లు తీసుకుని నియోజకవర్గ నేతలను కాదని పక్క నియోజకవర్గ నాయకులకు టికెట్ కేటాయించారని ఆరోపిస్తు రచ్చ చేస్తున్నారు. పార్టీ కోసం ఎంతో కష్టపడిన మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ ను కాదని.. ఈమధ్యనే అధికార వైసీపీ నుంచి వచ్చిన గుమ్మనూరు జయరాంకు టికెట్ ఇవ్వడంపై పార్టీ క్యాడర్ మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ఫోటోతో పాటు పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలను మంటల్లో వేసి కాల్చి బూడిద చేశారు.
అటు నెల్లూరు లోను టీడీపీ పార్టీపై వ్యతిరేఖత గట్టిగానే మొదలయ్యింది. నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి కి టికెట్ కేటాయించకపోవడంతో టీడీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపించారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అధిష్టానంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. పార్టీ కోసం కష్టపడి ఇన్నేళ్లుగా పని చేసిన వారిని పక్కన పెట్టడంపై నేతలు తీవ్ర అసహానం వ్యక్తం చేస్తున్నారు.పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంటూ సీట్ల కేటాయింపులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు చాలామంది నేతలు టీడీపీ ని వీడుతూ రాజీనామాలు చేస్తున్నారు.