టాలీవుడ్ నటుడు, వైసీపీ నేత అలీ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అటు సినిమాల్లో.. ఇటు రాజకీయాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఈ మధ్య ఎక్కడా కనిపించట్లేదు. అసలు వైసీపీలో ఉన్నారా..? బయటికి వచ్చేశారా..? అన్నట్లుగా పరిస్థితి ఉంది. 2019 ఎన్నికల ముందు హైడ్రామా మధ్య వైసీపీలో చేరిన ఆయన.. టికెట్ ఆశించారు కానీ.. రాలేదు అయితే ఎన్నికల ప్రచారానికే పరిమితమై నానా హడావుడి చేశారు. ఇప్పుడు ఆంధ్రాలో డూ ఆర్ డై అన్నట్లుగా జరుగుతుంటే కనీసం అలీ మాత్రం చలీ చప్పుడు చేయలేదు. దీంతో అలీకి వైసీపీ అక్కర్లేదా.. వైసీపీకి అలీ అక్కర్లేదా అనే అనుమానాలు వస్తున్నాయి.
ఏదో అనుకుంటే..?
ఏదో ఒకటి చేసి చట్టసభల్లో అడుగుపెట్టాలి.. అయితే అసెంబ్లీ లేకుంటే పార్లమెంట్ ఇదే అలీ మెయిన్ టార్గెట్. 2019 ఎన్నికల్లో విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఖరికి రాజ్యసభ సభ్యుడిగా అలీ అనుకున్నట్లుగానే చట్ట సభల్లోకి పంపాలని వైసీపీ అనుకున్నది కానీ.. కొన్ని సామాజిక సమీకరణలు, సీనియారిటీ రీత్యా అదేమీ జరగలేదు. అంటే ఎన్నికల ప్రచారానికి మాత్రమే వైసీపీ వాడుకుంది. ఆ తర్వాత అసంతృప్తితో రగిలిపోతున్న అలీకి ఎలక్ట్రానిక్ మీడియా అడ్వౌజర్ పోస్ట్ కట్టబెట్టింది. నాడు.. నేడు గుంటూరు ఈస్ట్ టికెట్‌ను అలీ ఆశించారు. అందుకు తగ్గ ప్రయత్నాలన్నీ చేశారు కూడా. అంతేకాదు.. ఒకానొక టైమ్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడ పోటీచేస్తే అక్కడ్నుంచే పోటీచేస్తారని కూడా టాక్ నడిచింది. జగన్ ఎక్కడ చెబితే అక్కడ నిలబడటానికి సిద్ధంగానే ఉన్నానని ప్రకటించేశారు అలీ. పవన్‌పై పోటీ సంగతి దేవుడెరుగు.. అసలుకే ఎసరొచ్చిపడింది.
ఏమైందమ్మా..!
వాస్తవానికి గుంటూరు ఈస్ట్ అసెంబ్లీ, హిందూపురం, నంద్యాల, గుంటూరు పార్లమెంట్ స్థానాల్లో పోటీచేయాలని.. ఇవీ కాకుంటే నెల్లూరు, కర్నూలు సిటీ, కడప సిటీ, రాజమండ్రి అసెంబ్లీ నుంచైనా పోటీచేయాలని ఎన్నో కలలు కన్నారు. సీఎంవో నుంచి ఎప్పుడెప్పుడు కాల్ వస్తుందా అని వేయికళ్లతో ఎదురుచూశారు కానీ.. ఆ ఆశలు అన్నీ అడియాసలే అయ్యాయి. పదిరోజుల వ్యవధిలో ఒక్కో జాబితాను రిలీజ్ చేసిన వైఎస్ జగన్ రెడ్డి.. ఈ జాబితాలో అయినా పేరొస్తుందని 175 మంది అసెంబ్లీ అభ్యర్థులు, 25 మంది ఎంపీ అభ్యర్థుల ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూశారట. తన పేరే లేకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన అలీ.. రాజకీయాలు అంటే ఇలాగే ఉంటుందేమో వద్దు బాబోయ్ అని తన సన్నిహితులతో చెప్పి తీవ్ర ఆవేదనకు లోనయ్యారట. దీంతో పాలిటిక్స్ ఇక అస్సలు వద్దు.. సినిమాలే ముద్దు అని మనసులో గట్టిగానే అనుకున్నారట. అయితే.. షూటింగ్ షెడ్యూల్‌లో బిజిబిజీగా ఉండటంతోనే ప్రచారానికి రాలేదని.. అసలు సిసలైన నోటిఫికేషన్ రాగానే అలీ వచ్చేసారని మరోవైపు టాక్ నడుస్తోంది. ఫైనల్‌గా ఏం జరుగుతుందో చూడాలి మరి.