ఒక పార్టీ నుంచి ఎంపీగా ఉన్న వ్యక్తి.. ఒక రాష్ట్రానికి గవర్నర్ అయ్యే ఛాన్స్ ఉంటే ఎవరైనా వదులుకుంటారా..? అస్సలు వదులుకోరు.. అంతే కాదు క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఎంపీ పదవికి రాజీనామా చేసేస్తారు కదా..? సరిగ్గా ఇదే పని వైసీపీ రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆర్ కృష్ణయ్య చేశారని వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ వార్తలు కూడా జాతీయ మీడియాలో రావడంతో ఇది నిజమే అనిపిస్తోంది. ఇంతకీ కృష్ణయ్యను గవర్నర్ పదవిలో చూడబోతున్నాం.. అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి.
పార్టీలు వద్దు!
వాస్తవానికి ఇప్పుడు రాజ్యసభలో బీజేపీకి బలం కావాలి. ఇందుకోసం ఏం చేయడానికైనా కాషాయ పార్టీ సిద్ధంగా ఉందట. ఇప్పటివరకూ వైసీపీ మద్దతుతో బిల్లులు ఆమోదం చేసుకున్న బీజేపీ.. ఇప్పుడు టీడీపీతో మిత్రపక్షాలుగా ఉండటం, టీడీపీకి కూడా పెద్దగా సభ్యులు లేకపోవడంతో పెద్ద చిక్కే వచ్చి పడిందట. దీనికి తోడు కీలక బిల్లుల విషయంలో ప్రతిపక్షాల ధాటికి నిలబడలేకపోతోంది బీజేపీ. ఇందుకే.. వైసీపీ ఎంపీలను ఒక చూపు చూస్తోందని అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఇద్దరు ఎంపీలు రాజీనామా చేశారనే చర్చ కూడా నడుస్తోంది. ఇప్పుడు కృష్ణయ్య కూడా ఇందులో భాగంగానే రాజీనామా చేశారని.. కాకపోతే.. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు టీడీపీలో చేరుతుండగా.. ఈయన మాత్రం ఇక రాజకీయాలకు స్వస్తి చెప్పే యోచనలో ఉన్నారని చెప్పుకుంటున్నారు అనుచరులు.
గవర్నర్ గిరి..!
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. దేశంలోని ఒక పెద్ద రాష్ట్రానికి కృష్ణయ్య గవర్నర్ కాబోతున్నారని జాతీయ మీడియా చెబుతోంది. ఈ మేరకు బీజేపీతో చర్చలు కూడా అయ్యాయని.. గవర్నర్ మార్పులు చేర్పులు త్వరలోనే జరగనున్నట్లు.. అందులో కృష్ణయ్య పేరు కూడా ఉంటుందని తెలుస్తోంది. ఐతే.. బీసీల కోసం పోరాటం చేయడానికే రాజీనామా చేశానని ఆయన చెప్పుకుంటున్నారు. త్వరలోనే బీసీ ఉద్యమం మొదలవుతుందని కూడా తెలుగు రాష్ట్రాల్లో గట్టిగానే హడావుడి నడుస్తోంది. ఇందులో ఎక్కువగా వైసీపీ మాజీ ఎంపీ గవర్నర్ కాబోతున్నారు అన్నదే ఎక్కువగా వినపడుతోంది. మరి ఉద్యమమా..? గవర్నర్ పదవా..? అనే దానిపై అతి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏం జరుగుతుందో చూడాలి మరి.