Advertisementt

సినీజోష్‌ ఇంటర్వ్యూ: ‘రేయ్‌’ హీరో సాయిధరమ్‌తేజ్‌

Tue 24th Mar 2015 10:51 AM
saidharam tej,rey movie on march 27th,yvs chowdary,sayami kher,shradha das  సినీజోష్‌ ఇంటర్వ్యూ: ‘రేయ్‌’ హీరో సాయిధరమ్‌తేజ్‌
సినీజోష్‌ ఇంటర్వ్యూ: ‘రేయ్‌’ హీరో సాయిధరమ్‌తేజ్‌
Advertisement
Ads by CJ

మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ని హీరోగా పరిచయం చేస్తూ బొమ్మరిల్లు పతాకంపై వై.వి.యస్‌.చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘రేయ్‌’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 27న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో హీరో సాయిధరమ్‌తేజ్‌తో ‘సినీజోష్‌’ ఇంటర్వ్యూ..

‘రేయ్‌’తో హీరోగా మీరు ఇంట్రడ్యూస్‌ అవుతున్నారని తెలిసినపుడు ఎలా ఫీల్‌ అయ్యారు?

నేను ఫలానా సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్‌ అవ్వాలన్న ఛాయిస్‌ అంటూ నాకు ఏమీ లేదు. ఒక యాక్టర్‌గా వద్దామనుకున్నాను తప్ప హీరో అవుదామని ఎప్పుడూ అనుకోలేదు. నన్ను హీరోగా లాంచ్‌ చేద్దామని చౌదరిగారు అనుకున్నారనీ, దానికి చిరంజీవిగారు కథ విని ఓకే అన్నారని తెలిసి చాలా ఎక్సైట్‌ అయ్యాను. డైరెక్టర్‌గారు వచ్చి కలిసారు. ఆయన్ని కథ కూడా అడగలేదు. ఆయన ఏం చెప్తే అది చేసేద్దామని డిసైడ్‌ అయ్యాను. కథ చెప్పిన తర్వాత నేను చాలా ఫ్రెష్‌ ఫీల్‌ అయ్యాను. కొత్త కారెక్టరైజేషన్‌, కొత్త బ్యాక్‌డ్రాప్‌ అవడం వల్ల నాకు బాగా నచ్చింది.

చిరంజీవి, నాగబాబు, పవన్‌కళ్యాణ్‌.. ఈ ముగ్గురిలో మీకు ఇన్‌స్పిరేషన్‌ ఎవరు?

ముగ్గురు మావయ్యలూ నాకు ఇన్‌స్పిరేషనే. ఎవరి ప్రత్యేకత వారికి వుంది. ముగ్గురిలో ఒకరి పేరు చెప్తే అది రాంగ్‌ అవుతుంది. అయితే నా జీవితంలో ముగ్గురు మావయ్యలు చాలా ఇంపార్టెంట్‌ పాత్రలు ప్లే చేశారు. ఎలాగంటే నాగబాబుగారు నేను చిన్నప్పుడు స్కూల్‌లో వున్న టైమ్‌లో పెయింటింగ్‌, స్పోర్ట్స్‌లాంటి యాక్టివిటీస్‌లో ఇంట్రెస్ట్‌ వుంటే దగ్గరుండి చూసుకునేవారు. నాకు ఏం కావాలో అవి కొనిపెట్టేవారు. హైదరాబాద్‌ షిఫ్ట్‌ అయిన తర్వాత ఎయిత్‌ క్లాస్‌ నుంచి డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ వరకు చిరంజీవిగారు చూసుకున్నారు. బాగా చదవుకోమని, లైఫ్‌ని బాగా ప్లాన్‌ చేసుకోమని చెప్పేవారు. నేను యాక్టర్‌గా మారిన తర్వాత నా కెరీర్‌కి సంబంధించి పవన్‌కళ్యాణ్‌గారు చూసుకుంటున్నారు. ఈ ముగ్గురి వల్లే ఇప్పుడు నేను ఇక్కడ వున్నాను. 

ఈ ముగ్గురి నుంచి మీరు నేర్చుకున్నదేమిటి?

చిరంజీవిగారి నుంచి క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడడం నేర్చుకున్నాను. ఒక వ్యక్తిగా వచ్చి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించారు. నాగబాబుగారి నుంచి నవ్వు, నిదానం నేర్చుకున్నాను. ఎంత ప్రాబ్లమ్‌ వచ్చినా హర్రీ లేకుండా నిదానంగా వెళ్తారు. ఎప్పుడూ జోవియల్‌గా వుంటూ నవ్వుతూ, నవ్విస్తూ వుంటారు. కళ్యాణ్‌గారి దగ్గర నుంచి నిబద్ధత, నిజాయితీ నేర్చుకున్నాను. ఏ విషయమైనా స్ట్రెయిట్‌ ఫార్వర్డ్‌గా వుంటారు. తప్పు చేసినా, ఒప్పు చేసినా మొహంమీదే చెప్పేస్తారు. ఎలాంటి మొహమాటాలు వుండవు.  

‘రేయ్‌’లో మీ క్యారెక్టర్‌ కోసం ఎలాంటి వర్కవుట్‌ చేశారు?

డైరెక్టర్‌గారు నాకు కథ చెప్పినపుడు కొన్ని విల్‌ స్మిత్‌ మూవీస్‌, క్రిస్‌ బ్రౌన్‌ మ్యూజిక్‌ వీడియో ఆల్బమ్స్‌ గురించి చెప్పారు. ఆ బాడీ లాంగ్వేజ్‌ క్యాచ్‌ చెయ్యడానికి ట్రై చెయ్యండి, నాకు కొంచెం ఈజీగా వుంటుందని చెప్పారు. వాటిని చూసి నేను ఎంతవరకు దాన్ని ప్రజెంట్‌ చెయ్యగలుగుతానో చూసుకొని, డైరెక్టర్‌గారితో డిస్కస్‌ చేసి రెండు, మూడు సార్లు రిహార్సల్స్‌ వేసుకున్నాను. ఆ తర్వాత షూటింగ్‌కి వెళ్ళాము. 

మీ క్యారెక్టర్‌ గురించి?

ఒక కరేబియన్‌ బేస్డ్‌ కిడ్‌. కరేబియన్స్‌ చాలా లౌడ్‌గా వుంటారు. మనసులో ఏది వున్నా చాలా వైబ్రెంట్‌గా చెప్తుంటారు. డ్యూటీలో అయినా, ఫ్రెండ్స్‌తో అయినా, రిలేషన్‌లో అయినా వారి ప్రవర్తన అలాగే వుంటుంది. ఇది నాకు కొంచెం ఎక్కువవుతుందేమో అని డైరెక్టర్‌గారితో అన్నప్పుడు.. అలాంటిది ఏమీ లేదు. కొత్త హీరో వస్తున్నప్పుడు వారికి ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్‌ వుండవు కాబట్టి డెఫినెట్‌గా యాక్సెప్ట్‌ చేస్తారని చెప్పారు.  

మీరెంతో కష్టపడి చేసిన లాస్ట్‌ సాంగ్‌ గురించి చెప్పండి?

ఆ పాటని నేను ఒక ఛాలెంజ్‌లా తీసుకున్నాను. సాంగా, నేనా చూసుకుందాం రండి అన్నట్టు చేశాం. లాస్ట్‌ 15 రోజులు ఈ పాటని ఉదయం 8 గంటల నుంచి ఎర్లీ మార్నింగ్‌ 3.30వరకు చేసేవాళ్ళం. ప్యాకప్‌ చెప్పిన తర్వాత తమ్ముడూ మార్నింగ్‌ 8కి రాగలవా అని డైరెక్టర్‌గారు అడిగేవారు. ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చి చేసే ఓపిక నాకు లేదు, స్టూడియోలోనే పడుకుంటాను అని చెప్పి అక్కడే పడుకొనేవాడిని. అలా కష్టపడి చేశాం. ఎందుకంటే ఆ పాట సినిమాకి హార్ట్‌ లాంటిది. ఆ పాట బాగా రావడం కోసం అంత తాపత్రయ పడ్డాం, తపన పడ్డాం. 

మీ ఫస్ట్‌ సినిమాయే డాన్స్‌ బేస్డ్‌ మూవీ చేశారు. ఎలా అనిపించింది?

బేసిక్‌గా మా మదర్‌ క్లాసికల్‌ డాన్సర్‌. ఆమె స్టేజ్‌ షోలు చూస్తూ, ఇమిటేట్‌ చేస్తూ వచ్చాను. యాక్టింగ్‌ చెయ్యాలని అనుకున్న తర్వాత, చౌదరిగారు ఇది డాన్స్‌ బేస్డ్‌ మూవీ అని చెప్పిన తర్వాత షూటింగ్‌కి నాలుగు నెలలు ముందు డాన్స్‌ మీద ఫోకస్‌ పెట్టి, బాగా ప్రాక్టీస్‌ చేశాను. అలాగే సినిమాలో ప్రతి సాంగ్‌కి ముందు రిహార్సల్స్‌ వుంటాయి. ఏయే స్టెప్స్‌ పెడదామనుకునేవారు అవి ప్రాక్టీస్‌ చేసేవాళ్ళం. ఆ స్టెప్‌ తప్ప మిగతా స్టెప్స్‌ సాంగ్‌లో వుండేవి. మార్చేశారేంటి సార్‌ అని అడిగితే లొకేషన్‌కి తగ్గట్టు మార్చాల్సి వచ్చిందని చెప్పేవారు. ఎక్కువగా ప్రాక్టీస్‌ చెయ్యడంవల్ల బాడీకి చాలా ఈజీగా వుండేది. 

‘రేయ్‌’ గురించి ఆడియన్స్‌కి మీరు ఫైనల్‌గా ఏం చెప్తారు?

నాలుగేళ్ళపాటు కష్టపడి ఒక క్వాలిటీ ప్రొడక్ట్‌ మీకు ఇవ్వాలని తాపత్రయ పడ్డాం. అలాగే చౌదరిగారి లైఫ్‌ ఈ సినిమాలో వుంది. ఈనెల 27న రిలీజ్‌ అవుతున్న ఈ సినిమాని థియేటర్‌కి వెళ్ళి చూడండి. డెఫినెట్‌గా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీ ఆశీస్సులు మాకు ఎప్పుడూ వుండాలని కోరుకుంటూ, పైరసీని ఎంకరేజ్‌ చెయ్యకండి. మా సినిమా అనే కాదు ఏ సినిమా విషయంలోనూ పైరసీని ఎంకరేజ్‌ చెయ్యొద్దు. మాలాగే వాళ్ళు కూడా కష్టపడి ఒక మంచి ప్రొడక్ట్‌ మీ ముందుకు తీసుకొస్తారు. దయచేసి థియేటర్‌లోనే సినిమా చూడండి అంటూ ఇంటర్వ్యూ ముగించారు ‘రేయ్‌’ హీరో సాయిధరమ్‌తేజ్‌. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ