పెంచిన విద్యుత్ ఛార్జీలు కాదు; ఉచితాలు తగ్గించమనండి జగన్ గారూ!
వేసవి ప్రారంభమయింది. నీటి ఎద్దడి ఆరంభమయింది. నిరంతర విద్యుత్తుకి హామీ ఇచ్చిన ఆంధ్రా ప్రభుత్వానికి విద్యుత్ పంపిణీ సంస్థలు రూ.1,188 కోట్ల మేర పెంపును ప్రతిపాదించగా రూ.247 కోట్లు తగ్గించి రూ.941 కోట్ల పెంపునకు అంగీకరించింది. అయితే బడుగులపై ఈ భారం మోపకుండా 200 యూనిట్లవరకు వినియోగంపై కొత్తగా ఎలాంటి భారం మోపడంలేదు. కానీ పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలని గొంతుపెంచారు జగన్ గారు. నిరంతర విద్యుత్తు - రైతులకు వైయస్సార్ ఇచ్చిన ఉచిత విద్యుత్తు - 200 యూనిట్ల వరకు విద్యుత్తు టారిఫ్‌లో మార్పులేదు. విలాసాలకు, కళ్ళు జిగేల్మనే అలంకరణకు అధిక విద్యుత్తు వాడుకునేవారికి విద్యుత్తు సబ్సిడీ అవసరమా? ఇంట్లో - ఆఫీసులో ఎసిలు; ఎల్సిడి టివిలు - ఎయిర్ కండిషన్డు హోమ్ థియేటర్లు - ఎలక్ట్రికల్ హోమ్ అప్లయన్సెస్ వాడుకునేవారికి సబ్సిడీ ధరపై విద్యుత్తు సరఫరా చేయమని డిమాండ్ చేయడం భావ్యమా జగన్ గారూ!
పేదలకు రేషన్ బియ్యం నాలుగు కేజీలు - ఒక్కో వ్యక్తికి. ఆహార భద్రత క్రింద కేంద్రం కుటుంబంలో నలుగురికి నాలుగేసి కేజీల చొప్పున కిలో మూడు రూపాయలకు ఇవ్వమంది. కానీ చంద్రబాబు తెల్ల రేషను కార్డు వుంటే చాలు ‘నాలుగు’ నిబంధనని తొలగించి ఇంట్లో ఎంతమంది వుంటే అంతమందికి ‘అయిదు’ కిలోల చొప్పున బియ్యం అదీ కేంద్రం చెప్పినట్లు మూడు రూపాయలు కాకుండా కిలో రూపాయికే! దీని వలన 1.3 కోట్ల రేషను కార్డు దారులకు రూపాయికే కిలో బియ్యం ` ఒక్కొక్కరికి అయిదు కిలోలు : దీని వలన 800 కోట్ల రూపాయల అదనపు భారం!
అసలే లోటు బడ్జెట్ ` ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ` ఈ స్థితిలో పండుగలకు అదనపు రేషన్, రూపాయికే కిలో బియ్యం, పెళ్ళికి పదివేల చదివింపులు వగైరా వగైరా సమర్ధనీయమా? ఓవైపు విచ్చలవిడిగా ‘ఫ్రీ ... ఫ్రీ... ఫ్రీ’ అంటూ మరోవైపు కేంద్రాన్ని బిచ్చమెత్తడాన్ని సమర్ధిస్తారా?
- జాతిని త్యాగాలకి సిద్ధంజేయండి! కష్టపడి పని, ఇష్టపడి చదువు అలవాటు చేయండి. పని కల్పించండి; విద్య వైద్యాలయాలపై ఖర్చుపెట్టండి
- జగన్ గారూ ప్రజలను ఆలోచించేలా చేయండి; ప్రజల హృదయాలలో పది కాలాలపాటు నిలవండి!! రేపటి ఎన్నికలపై కాదు రేపటి తరంపై మనసు పెట్టండి.