వాణిజ్య సంస్థల బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకోకుండా ఒప్పందాలు చేసుకుంటే కొన్నిసార్లు పెద్దపెద్ద హీరోలకు కూడా ఇబ్బందులు తప్పవు. ఆదాయ అభివృద్ధికి సంబంధించి బాలీవుడ్ బాద్‌షా షారూక్‌ఖాన్ ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇలాంటి ఓ నిర్ణయమే ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టింది. ఐపీఎల్ జట్టు కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కు షారూక్‌ఖాన్ సహయజమానిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ జట్టుకు రోజ్‌వ్యాలీ అనే సంస్థ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. దీనికి సంబంధించి షారూక్‌ఖాన్‌కు చెందిన రెడ్ చిల్లీస్ సంస్థకు రోజ్‌వ్యాలీ రూ. 10 కోట్లు చెల్లించింది. అయితే ఇటీవలే తేలిదేంటంటే రోజ్‌వ్యాలీ సంస్థ ప్రజలనుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్లు కేసు నమోదైంది. దీంతో ఈ కేసు తన మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనని భయపడ్డ షారూక్‌ఖాన్ రోజ్‌వ్యాలీ చెల్లించిన రూ. 10 కోట్లను తిరిగి ఆ సంస్థకు చెల్లించారు. ఇప్పటికే నైట్‌రైడర్స్ జట్టుతో కొన్నాళ్లు పబ్లిసిటీ పొందిన రోజ్‌వ్యాలీ సంస్థకు ప్పుడు రూ. 10 కోట్లు కూడా తిరిగి రావడంతో ఫ్రీగా పబ్లిసిటీ దొరికినట్టయ్యింది.