చంద్రబాబునాయుడు ఏ పనిచేసినా పక్కా ప్రణాళికబద్ధంగా ఉంటుంది. ఇక ఇటీవలే జరిగిన శాసన సభ సమావేశాల్లో టీడీపీ సభ్యుల పనితీరుపై చంద్రబాబు ఓ కమిటీ వేశారు. మంత్రి అచ్చెన్నానాయుడు, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే కేశవ్, ఎమ్మెల్యే దూళ్లపాళ్ల నరేంద్ర, మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఇక శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపై ఈ కమిటీ ఓ నివేదిక తయారు చేసి అధినేత చంద్రబాబుకు అప్పగించింది. అయితే టీడీపీ శాసనసభ్యుల్లో కేవలం 25 మంది మాత్రమే సమావేశాల్లో చురుకుగా పాల్గొన్నారని, విపక్షాల ఆరోపణలను బలంగా తిప్పికొట్టారని ఈ కమిటీ తేల్చిచెప్పినట్లు సమాచారం. సమావేశాల్లో సీనియర్ సభ్యులే చురుకుగా వ్యవహరించలేదంటూ వారిలో కొందరి పేర్లను కూడా బాబుకు పంపినట్లు తెలుస్తోంది. ఇక శాసనసభలో అంత చురుకుగా లేని సభ్యులకు చంద్రబాబు క్లాస్ తీసుకుంటారని సమాచారం.