ప్రత్యర్థికి మేలు చేస్తూ సెల్ఫ్‌గోల్ చేయడంలో రాహుల్‌గాంధీది అందవేసిన చెయ్యి. రాహుల్ చేసిన తప్పులను వెనకేసుకు రాలేక కాంగ్రెస్ పెద్దలు ఎప్పుడు తలలు పట్టుకుంటారు. 2014లో అధికారంలోకి వచ్చిన ఎన్‌డీఏ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ సమావేశాల్లో రాహుల్ పార్లమెంట్‌లో కునుకుతీస్తూ కనిపించారు. అయితే ఆ సమయంలో రాహుల్ కునుకు తీయలేదని, దీర్ఘంగా ఆలోచిస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు సర్దిచెప్పలేక సతమతమయ్యారు. ఇక 2015 ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో రాహుల్ గాంధీ పత్తాలేకుండా పోయారు. దేశాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఎంతో కీలకమైన బడ్జెట్ సమావేశాలకు ఆయన డుమ్మా కొట్టి సెలవుపై వెళ్లి సేదతీరారు. ఆయన దేశంలోనే ఉన్నాడా..? లేక విదేశాల్లో సేద తీరుతున్నాడా..? అనే విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతలకు కూడా స్పష్టత కరువైంది. ఇక ఎట్టకేలకు ఆయనకు సంబంధించిన సమాచారాన్ని సోనియాగాంధీ సెలవిచ్చారు. త్వరలోనే తన నెల రోజుల సెలవులు ముగించుకొని రాహుల్ దేశానికి తిరిగి రానున్నట్లు సోనియా విలేకరులకు తెలిపారు.