జేసీ దివాకర్‌రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఎవరికీ భయపడని మనస్తత్వం ఆయనది. టీడీపీ నుంచి ఎంపీగా గెలుపొందిన ఆయన ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గురించి కూడా కుండబద్దలు కొట్టినట్లు అభిప్రాయాలు వెల్లడిస్తుంటారు. తాజాగా ఆయన మరోమారు వార్తల్లోకి ఎక్కారు. అనంతపురం జిల్లా యల్లనూరు మండలం సింగవరం వద్ద పులివెందుల బ్రాంచి కెనాల్‌కు టీడీపీ ఎమ్మెల్యే యామినిబాలతో కలిసి గండికొట్టారు. కేవలం స్థానికుల తాగునీటి కోసమే కాల్వకు గండికొట్టామని జేసీ సమర్థించుకుంటున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ జేసీని చూసి మిన్నకుండిపోయారు. ఇదే చర్యకు ప్రతిపక్షాల నాయకులు పాల్పడితే ఇప్పటికి అరెస్టు కూడా జరగాల్సింది. అయితే జేసీ అధికారపక్ష సభ్యుడు కావడంతోనే పోలీసులు మిన్నకుండిపోయారని విపక్షాల సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ప్రతిపక్షమైనా.. విపక్షమైనా జేసీ దూకుడు ఆగదని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు.