తెలంగాణలో కేసీఆర్ పదవీబాధ్యతలు చెప్పట్టగానే పోలీస్‌వ్యవస్థపైనే దృష్టిసారించారు. వారికి కొత్తవాహనాలతోపాటు వాహనాల మెయింటనెన్స్‌తోపాటు స్టేషనరీకి కూడా నిధులు విడుదల చేశారు. గతంలో ఏప్రభుత్వం చేయని విధంగా పోలీస్ వ్యవస్థ ప్రక్షాళనపైన కేసీఆర్ దృష్టిసారించడం ఖాకీలను ఆకట్టుకుంది. దీనికితోడు డీజీపీ అనురాగ్‌శర్మ పకడ్బందీగా చర్యలు తీసుకోవడంతో పోలీస్ పనితీరు మెరుగుపడింది. నగరాల్లోనే కాకుండా రెండోస్థాయి టౌన్‌లలో కూడా రాత్రి పదిగంటలు దాటిన తర్వాత ఏ ఒక్కదుకాణం కూడా తెరుచుకోవడం లేదు. పోలీస్ పెట్రోలింగ్ కూడా పటిష్టం కావడంతో క్రైంరేటు కూడా బాగా తగ్గింది. అయితే ఇటీవల నల్గొండలో చోటుచేసుకున్న కాల్పుల ఘటన తెలంగాణలో శాంతిభద్రతలపై ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఉగ్రవాదులు రెండోసార్లు ఎదురుపడ్డా.. సరైన ఆయుధాలు లేకపోవడంతో పోలీసులు వారితో పోరాడలేక పరారైన సంగతి కాస్త విస్మయం కలిగించేదే. ఈ ఒక్క సంఘటన గత పదినెలలుగా శాంతిభద్రతల పరిరక్షణకు కేసీఆర్ తీసుకున్న చర్యలను అపహాస్యం చేసింది. దీనికితోడు ఈ కాల్పుల ఘటనలో మృతిచెందిన ముగ్గురు పోలీసు సిబ్బందిలో ఏ ఒక్క బాధిత కుటుంబాన్ని కూడా కేసీఆర్ పరామర్శించకపోవడం మరిన్ని విమర్శలకు ఆస్కారానిచ్చింది. ఇక టీ-పోలీసులకు మరింత అధునాత ఆయుధాలను అందించి శాంతిభద్రతల మెరుగుకు చర్యలు తీసుకోవాలని టీ-సర్కారు యోచిస్తున్నట్లు సమాచారం.