సగటు మనిషికి ప్రభుత్వమంటే పోలీసు, చట్టమంటే పోలీసు. ఖాకీ యూనిఫారమ్ ధరించిన ప్రతిపోలీసూ 24 గంటలు, 365 రోజులూ డ్యూటీ చేస్తున్నట్టే లెక్క. తుపాను, అగ్నిప్రమాదం, దోపిడీ, రైలు ప్రమాదం, బస్సు యాక్సిడెంట్, మిలిటెంట్లదాడి ఇలా ఏ ఉపద్రవం ముంచుకొచ్చినా ముందుండేది పోలీసు. దొంగల్ని, దోపిడీదారుల్ని, రేపిస్టులను, టెర్రరిస్టులను, నక్సలైట్లని, గూండాలను గుర్తించే ప్రక్రియలో రాజ్యాంగం గీసిన లక్ష్మణరేఖని పోలీసులు దాటవచ్చు. పౌరహక్కులకు భగ్నం కలగవచ్చు. వ్యక్తిగత గౌరవం దెబ్బతినవచ్చు. ఒక్కొక్క కేసుని నిశితంగా పరిశీలిస్తే పోలీసు క్రౌర్యం కనిపించవచ్చు. రక్షక భటుడ్ని, దోషిగా చట్టంముందు నిలిపేముందు సంఘ విద్రోహ శక్తుల తూటాలకు రాలిపోతున్న పోలీసుల్ని, ఎండనక వాననక డ్యూటీ చేసే ఖాకీ డ్రెస్‌ని, అర్ధరాత్రిపూట కూడా భార్య, బిడ్డలను వదిలి నడిరోడ్డుమీద డ్యూటీ చేసే పోలీసుని అర్ధంజేసుకుందాం. జీవితాన్ని త్యాగం చేసే పోలీసుకి సెల్యూట్ చేద్దాం, ఇంటి యజమాని సేవలు, సహచర్యానికి దూరంగా వుండే ఆ కుటుంబాన్ని గౌరవిద్దాం.