అల్లు అర్జున్ హీరోగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్.రాధాకృష్ణ నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘S/o సత్యమూర్తి’. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన సమంత హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో సమంత చేసిన సుబ్బలక్ష్మీ క్యారెక్టర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోందని చెప్తోంది సమంత. ఈ నేపథ్యంలో సమంతతో ‘సినీజోష్’ ఇంటర్వ్యూ.
ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది?
నేను బేసిక్‌గా త్రివిక్రమ్‌గారి ఫ్యాన్‌ని. ఆయన సినిమాలు నాకు బాగా నచ్చుతాయి. అత్తారింటికి దారేది చేసిన తర్వాత మళ్ళీ త్రివిక్రమ్‌గారితో సినిమా చెయ్యాలనుకున్నాను. ఆ టైమ్‌లో ఈ సినిమా ఆఫర్ వచ్చింది. వెంటనే ఓకే చేశాను. నేను మొదటి నుంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్‌కి ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. ఆడియన్స్ ఈ సినిమాని యాక్సెప్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా వుంది. కలెక్షన్స్ చాలా ఎక్స్‌ట్రార్డినరీగా వున్నాయి. ఫస్ట్ డే మిక్స్‌డ్ టాక్ వల్ల, రివ్యూస్ వల్ల బాధ అనిపించింది. ఈ సినిమాకి అలాంటి రివ్యూస్ నేను ఎక్స్‌పెక్ట్ చెయ్యలేదు. నేను చాలా షాక్ అయ్యాను. అయితే ఫస్ట్ డే వున్న రిపోర్ట్‌కి ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్‌కి చాలా డిఫరెన్స్ వుంది. ఇప్పుడు చాలా మంచి టాక్ వుంది.
ఒక డయాబెటిక్ పేషెంట్‌లా చెయ్యడం ఎలా అనిపించింది?
నా ఫ్రెండ్స్, వెల్ విషర్స్ ఆ క్యారెక్టర్ ఎందుకు చేశావని అడిగారు. అయితే నాకు రెండు సంవత్సరాల క్రితం లో షుగర్ వుండేది. అయితే వర్క్ మాత్రం నార్మల్‌గానే వుండేది. ఇలాంటి ప్రాబ్లమ్ చాలా మందికి వుంటుంది. దాన్ని లైటర్‌వేన్‌లో తీసుకున్నాం. ప్రస్తుతం అమ్మాయిలకు చాలా ప్రాబ్లమ్స్ వున్నాయి. సినిమాలో నేను చేసిన కొన్ని సీన్స్‌కి చాలా మంచి అప్రిషియేషన్ వచ్చింది.
త్రివిక్రమ్‌తో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
త్రివిక్రమ్‌గారి సినిమాలు చేస్తూనే నా కెరీర్ కంప్లీట్ అయిపోయేలా వుంది. ఆయనతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. వరసగా రెండు సినిమాలు చెయ్యడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను.
అల్లు అర్జున్‌తో ఫస్ట్ టైమ్ నటించారు. ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా వుంది?
బన్నీ స్టైలిష్‌గా వుండే స్టార్. ఆయన పక్కన నటించాలంటే నువ్వు కూడా లుక్ వైజ్ బాగుండాలి. లేకపోతే ఆయన పక్కన పనిమనిషిలా కనిపిస్తావని ఫ్రెండ్స్ చెప్పారు. దాంతో షూటింగ్‌కి నెక్స్‌ట్ డే ఆయన ఏ డ్రెస్ వేసుకుంటున్నారో కనుక్కొని దానికి తగ్గట్టు నేను కూడా ప్రిపేర్ అయ్యేదాన్ని. వర్క్ విషయానికి వస్తే బన్ని చాలా డిసిప్లిన్డ్ పర్సన్. చాలా డెడికేటెడ్‌గా వర్క్ చేసేవారు. ఆయన వర్క్ చూసిన తర్వాత నాకు పనిమీద శ్రద్ధ లేదేమో అని చాలాసార్లు అనిపించింది. అంత హార్డ్ వర్క్ చేస్తారు కాబట్టే ఆయనకి అంత మంచి పేరు వుంది. ఆయనతో డాన్స్ చేయడం చాలా కష్టం ఈ సినిమాలో ఎక్కువ డాన్స్ లేకపోవడంతో ఎస్కేప్ అయ్యాననే చెప్పాలి. అలానే ఈ సినిమాలో ఇద్దరి హీరోయిన్లతో షేర్ చేసుకోవడం సంతోషంగా అనిపించింది. నిత్య మంచి టాలెంటెడ్ పెర్సన్. అదాశర్మ మంచి నటి. ఈ సినిమా ద్వారా ఆమెకు మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను.
ఈ ఐదు సంవత్సరాల్లో ఏమాయ చేసావే, మనం తర్వాత అంత గుర్తింపు తెచ్చే క్యారెక్టర్లు మీరు చెయ్యలేదు. దీనికి ఏమంటారు?
మనం తర్వాత పెర్‌ఫార్మెన్స్‌కి స్కోప్ వున్న క్యారెక్టర్ చెయ్యలేదు. అది నేను ఒప్పుకుంటాను. అయితే ప్రస్తుతం విక్రమ్, విజయ్ మిల్టన్ కాంబినేషన్‌లో ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నాను. ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతుందనుకుంటున్నాను. ఇంతకుముందు ఎప్పుడూ చెయ్యని క్యారెక్టర్ ఈ సినిమాలో చేస్తున్నాను. దాని కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు చేశాను. నా క్యారెక్టర్ కోసం కొన్ని రిస్కులు కూడా చేస్తున్నాను. ఈ క్యారెక్టర్ తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఒక మంచి క్యారెక్టర్ చేశానని అందరూ చెప్పుకుంటారు.
నెక్స్‌ట్ ప్రాజెక్ట్స్?
నేను చేయబోయే సినిమాల గురించి ముందుగానే చెప్పే అలవాటు నాకు లేదు. షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడే చెప్తాను. అలాగే కొన్ని ప్రాజెక్ట్స్ వున్నాయి. అవి ఏమిటో త్వరలోనే మీకు తెలుస్తాయి అంటూ ఇంటర్వ్యూ ముగించారు హీరోయిన్ సమంత.