యువరాజు విచ్చేశారు. ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు 55 రోజుల సెలవుల అనంతరం ఆయన దేశోద్ధరణకు తిరిగివచ్చాడు. రాహుల్‌గాంధీ ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురుచూస్తున్న కాంగ్రెస్ నాయకులకు ఎట్టకేలకు ఉపశమనం దక్కింది. గురువారం ఉదయం ఆయన ఢిల్లీలోని తన నివాసానికి తిరిగివచ్చారు. రాహుల్‌గాంధీ పునారాగమనంపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే బడ్జెట్ సమావేశాలను కూడా కాదని రాహుల్‌గాంధీ సెలవులపై వెళ్లడం తీవ్ర వివాదాస్పదమైంది. ఆయన ఎప్పుడు తిరిగి వచ్చే అంశంపై కూడా నాయకులకు స్పష్టత లేకపోవడంతో బీజేపీ విమర్శలను తిప్పికొట్టడానికి కూడా కాంగ్రెస్ నాయకుల వద్ద సమాధానం లేకపోయింది. రాహుల్ గాంధీ విదేశాల్లో ఉన్నారంటూ కొన్నిసార్లు.. ఉత్తరాఖండ్‌లోనే విడిది చేస్తున్నారంటూ కొన్నిసార్లు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. వరుస ఓటములతో చతికిలబడ్డ కాంగ్రెస్‌ను తిరిగి ఆయన విజయపథంలో నడిపిస్తారని కాంగ్రెస్ శ్రేణులు ఆశిస్తున్నాయి. అంతేకాకుండా తన అనారోగ్య కారణాలరీత్యా పార్టీ అధ్యక్ష పదవిని రాహుల్‌కు అప్పగించాలని సోనియా కూడా యోచిస్తున్నారు. మరి అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన తర్వాత పార్టీ క్యాడర్‌లో పునరుత్తేజం నింపడానికి రాహుల్ ఎలాంటి చర్యలు చేపడుతారో వేచిచూడాల్సిందే.